-ప్రతి మండలంలో వారానికి రెండు స్లాట్లు పడాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ భవన నిర్మాణాలు యుద్ధప్రాతిపదికపై పూర్తి చేసే దిశగా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. ఉపాధి హామీ కింద గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ భవన నిర్మాణాల ప్రగతి తీరుపై స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మండల అధికారులతో జిల్లా కలెక్టర్ జె.నివాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రతి వారం రెండు స్లాబులు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు తుది దశకు వచ్చిన వాటిని వెంటనే పూర్తి చేసి అప్పగించాలన్నారు. ఈ నిర్మాణ పనుల్లో లక్ష్యానికి మించి బాగా పనిచేసిన కంకిపాడు, నందిగామ, పంచాయితీరాజ్ డిఇలను, మచిలీపట్నం ఎఇతో పాటు పలువురు ఇంజనీర్లను కలెక్టర్ జె. నివాస్ అభినందించారు. నాగయలంకలో పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పనులను వేగవంతం చేయాలన్నారు. పనులు పూర్తి చేసిన వాటికి సంబంధించి ఖర్చును సంబంధిత ఖాతాల్లో నమోదు ఎప్పటికప్పుడు చేయాలన్నారు. బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ల భవన నిర్మాణాలు నూరు శాతం గౌండింగ్ కావాలన్నారు. జూలై నెలఖారు నాటికి కొన్ని బియంసియు లను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైన ఇంకా స్థల సేకరణ సమస్య ఉంటే త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె. మోహన్కుమార్, డ్వామా పిడి యం. సూర్యనారాయణ, పంచాయితీరాజ్ ఎస్ఇ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.