-1000 మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యం పట్టివేత, క్రిమినల్ కేసు నమోదుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం
-మంత్రి రాకను ముందుగానే తెలుసుకుని పేరేచర్లలో రైస్ బ్యాగ్ ట్యాగ్‌లు దహనం చేసిన రైస్ మిల్లు నిర్వాహకులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారంనాడు గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ వెలుగు చూసిన అక్రమాలు చూసి అవాక్కయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రామలింగేశ్వర ట్రేడర్స్ రైస్ మిల్లును తనిఖీ చేసిన మంత్రి రైస్ మిల్లులో వందలకొద్దీ రైస్ బ్యాగుల్లో ప్రభుత్వం పంపిణీ చేసే చౌక ధరల బియ్యాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లులో దాదాపు 100 టన్నుల పిడిఎస్ రేషన్ గుర్తించిన మంత్రి ఈ విషయమై స్థానిక ఎమ్మార్వో చక్రవర్తిని ప్రశ్నించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెట్రాలజీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు రైస్ మిల్లు ప్రతి బ్యాగ్‌ని పరిశీలించాలని పంచనామా అనంతరం క్రిమినల్ కేసులు నమోదు చేసి రైస్ మిల్లును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సత్తెనపల్లి టౌన్‌లో సీతారామాంజనేయ సాయి, గణేష్ రైస్ మిల్ ఫ్లోర్ మిల్, శ్రీదేవి ట్రేడర్స్, రావు రైస్ మిల్, ఫ్లోర్ మిల్ కోమరపుడి గ్రామం, సత్తెనపల్లి మండలం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైస్ మిల్లులను మంత్రి తనిఖీ చేశారు. గుంటూరు జిల్లాలో మేడికొండ మండలం పేరేచెర్ల గ్రామంలో మూడు రైస్ మిల్లులను కూడా మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. రైస్ మిల్లు ప్రాంతంలో రేషన్ సప్లై చేసే వాహనాన్ని దాచి ఉంచిన వైనాన్ని చూసి మంత్రి ఆశ్చర్యపోయారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పేరే చెర్ల నందు మంత్రి రాకను ముందుగానే తెలుసుకుని వెంకటేశ్వర రైస్ మిల్ ప్రాంగణంలో సీఎంఆర్ రైస్ బ్యాగ్ టాగ్‌లను నిర్వాహకులు దహనం చేశారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి రైస్ మిల్ సిబ్బందిని అదుపులోకి తీసుకోవాలని, పంచనామ నిర్వహించి కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే విఘ్నేశ్వర రైస్ మిల్లు గుంటూరు జిల్లాలో తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ టార్చ్ లైట్ వెలుగులో రైస్ మిల్లులో బియ్యం, రికార్డులు మరియు 26 కేజీల బియ్యం బస్తాల తూకాన్ని పరిశీలించారు. సాధారణ పౌరుడిలా ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సత్తెనపల్లిలో రోడ్డు పక్కన ఆగి టీ తాగారు. రైస్ మిల్లు తనిఖీల కోసం పల్నాడు జిల్లా సత్తెనపల్లి వచ్చిన మంత్రి రోడ్డు పక్కనే కారు ఆపించి బడ్డీ కొట్టు వద్ద టీ తాగారు. అక్కడ సామాన్యులను నిత్యావసర ధరలపై ఆరా తీశారు.