Breaking News

ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పటిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు ముదావత్ ఎం నాయక్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలసి ఓటర్ల జాబితా తయారీపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్ల జాబితా కీలకమని అది పటిష్టంగా ఉన్నప్పుడే ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరుగుతాయన్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో మృతి చెందిన ఓటర్లను, శాశ్వతంగా వలస పోయిన ఓటర్లను తొలగించి సరైన జాబితాను తయారు చేయవలసి ఉంటుందన్నారు. ఓటర్ల జాబితాలో ఫోటోలు నాణ్యత పరంగా బాగుండాలన్నారు. ఇందుకోసం బాగా కనిపిస్తున్న ఫోటోలను సేకరించాల్సి ఉంటుందన్నారు. ఒక ఓటరుకు ఒక ఓటు మాత్రమే ఉండాలని రెండో ఓటు (డూప్లికేట్) లేకుండా తీసేయాలని సూచించారు.
ఈ మార్గదర్శకాలను బూత్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి వారికి స్పష్టంగా తెలియజేయాలన్నారు.
ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు చేస్తూ జరిపే నిరంతర ప్రక్రియగా నడుస్తుందన్నారు.
ఈనెల 9, 10, 23, 24 తేదీలలో శని,ఆదివారాలలో ఓటరు నమోదు, చేర్పులు, మార్పుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి బిఎల్ వో ల ద్వారా దరఖాస్తులు స్వీకరించే విషయమై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సజావుగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయవలసి ఉంటుందని, ఇందు కోసం రాజకీయ పార్టీల ప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. వారితో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను స్వీకరించి సరిగా విచారించి అందుకు అనుగుణంగా తాజా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు. టిడిపి ప్రతినిధులు తెలిపినట్లుగా ఒక ఇంటి నెంబర్, చిరునామాలోని భార్యాభర్తలను, కుటుంబ సభ్యులను ఒకే చోట వరుసగా వచ్చేటట్లు ఓటర్ల జాబితాలో వారి పేర్లు నమోదు చేయాలని సూచించారు.

తొలుత జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 25 మండలాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉన్నాయని వివరించారు. జిల్లాలో మొత్తం 20,97,208 మంది 2025 సంవత్సరం భావి జనాభాగా ఉండవచ్చన్నారు. జిల్లాలో 15,38,937 ఓటర్లు ఉన్నారని, అందులో 7,45,774 మంది పురుష ఓటర్లు, 7,93,108 మంది మహిళా ఓటర్లు, 55 మంది ఇతరులు, 575 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారన్నారు.
ప్రతి 1,000 మంది పురుష ఓటర్లకు గాను 1063 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. అదే ఓటర్లు-జనాభా (ఈపి) నిష్పత్తి 734 గా ఉందన్నారు. లింగ నిష్పత్తిలో చూస్తే మహిళలు ఎక్కువగా ఉన్నారన్నారు. జిల్లాలో 1769 పోలింగ్ కేంద్రాలు 1016 ప్రదేశాల్లో ఉన్నాయన్నారు. జిల్లాలో 7 మంది ఓటర్ల నమోదు అధికారులు, 34 మంది సహాయ ఓటర్ల నమోదు అధికారులు ఉన్నారన్నారు. ఇప్పటివరకు 22,439 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారని 10,616 మంది 85 సంవత్సరాల పైబడి ఓటర్లు, 546 మంది విదేశీ ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో ఈనెల 9,10, 23, 24 తేదీల్లో ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు విస్తృతంగా ప్రచారం నిర్వహించామన్నారు. జిల్లాలో గన్నవరం, పెడన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈఆర్వోలు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం ఇన్చార్జి ఏర్పాట్లు చేశామని ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపామన్నారు. వాటిని భర్తీ చేయాల్సి ఉందన్నారు.

ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలపమని జిల్లా కలెక్టర్ కోరగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వచ్చాక 95% చాలావరకు ఓటర్ల జాబితా సరి చేశారన్నారు. అయితే తనకు తన భార్యకు ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో దూర దూరంగా వేరు వేరు గా వరుస నెంబర్లతో పేర్లు ఉన్నాయని ఆ విధంగానే చాలామంది ఒకే కుటుంబంలోని పేర్లు వేరు వేరు చోట్ల ఉంటున్నాయని అలా ఉండటం వలన ఓటర్ల జాబితా పరిశీలనకు వెళ్ళినప్పుడు కొందరు పేర్లు ఉన్నట్లు కొందరికి లేనట్లుగా భావించే పరిస్థితి ఏర్పడుతుందని అలా కాకుండా ఒక ఇంటి నెంబర్ లోని ఒక కుటుంబంలోని ఓటర్ల పేర్లన్నీ వరుసగా ఒకే చోట వచ్చేలాగా జాబితా తయారు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ఇన్చార్జి డిఆర్ఓ శ్రీదేవి, మచిలీపట్నం, గుడివాడ,పెనమలూరు, పామర్రు, గన్నవరం నియోజకవర్గాల ఈఆర్ఓ లు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, బిఎస్.హేచ్. షారోన్, జి రమేష్ బాబు, షాహిద్ బాబు పలువురు ఏ ఈ ఆర్ వో లు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు దిలీప్ కుమార్, పి వెంకన్న, ప్రసాద్ బీఎస్పీ ప్రతినిధి ఎస్ బాలాజీ, సిపిఎం ప్రతినిధి శర్మ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *