Breaking News

మరో సింగ్ నగర్ నిర్మించుకుందాం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. 59వ డివిజన్ లో గృహ నిర్మాణ లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ  కరీమున్నీసా, డివిజన్ కార్పొరేటర్  షాహినా సుల్తానా తో కలిసి ఆయన పాల్గొన్నారు. నవరత్నాల పథకాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పేదలకు కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు  మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31 లక్షల మంది పేద కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సొంతింటి స్థలాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 30వేల మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించడమైనదని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా రూ. 270 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. ఒక్క 59వ డివిజన్ లోనే 500 మందికిపైగా పేదలకు లబ్ధి చేకూరినట్లు వివరించారు. పేదలకు ఉచితంగా స్థలం ఇవ్వడమే కాకుండా.. ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 1 లక్షా 80 వేల ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతోందన్నారు. లబ్ధిదారుని అవసరాన్ని బట్టి మరో రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు బ్యాంకర్ల నుంచి రుణాన్ని సమకూరుస్తామన్నారు. లబ్ధిదారుడు నెలవారీ అద్దెలకు చెల్లించే మొత్తాన్ని బ్యాంకులకు కట్టుకోవడం ద్వారా.. త్వరలోనే రుణవిముక్తుడవుతాడని మల్లాది విష్ణు గారు తెలియజేశారు. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఉచితంగా ఇసుక, సబ్సిడీపై సిమెంట్, ఐరన్ అందించబోతున్నట్లు వివరించారు. మరోవైపు నున్న ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణంలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. రాబోవు రోజుల్లో ఆ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దబోతున్నట్లు మల్లాది విష్ణు గారు తెలియజేశారు. ఓవైపు గృహ నిర్మాణాలు జరుగుతుండగానే మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, హెల్త్ క్లినిక్ లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో.. పట్టణాలను తలపించేలా కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నట్లు వెల్లడించారు. కావున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను అందిపుచ్చుకుని లబ్ధిదారులు కొత్త ఏడాది ఆరంభంలోగా గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్ల నిర్మాణాలలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందు వరసలో నిలపాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు హఫీజుల్లా, నేరెళ్ల శివ, పల్లెపోగు రాజు, అమితాబ్, శీను తదితరులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *