Breaking News

ఏపీలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రోజెక్టుల కోసం రిలయన్స్ రూ 65,000 కోట్ల పెట్టుబడులు

-ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ 57,650 కోట్ల ఆదాయం తో పాటు 2. 5 లక్షల మందికి ఉద్యోగ , ఉపాధి కల్పనకు అవకాశం
-ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
– సత్ఫలితాలు ఇస్తున్న ఏ పీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ
– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూర దృష్టి , నాయకత్వం పై పెట్టుబడిదారులకు భరోసా
– ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు క్యూ కట్టిన అంతర్జాతీయ సంస్థలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రూ 65,000 కోట్ల రూపాయల పెట్టుబడి తో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దేశంలోనే అగ్రశ్రేణి సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంగళవారం ఏ పీ సచివాలయంలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, మానవ వనరుల, ఐటి, ఈసి, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీ జీ భరత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీరభ్ కుమార్ ప్రసాద్ , ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ముంబై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు, పి.ఎం.ఎస్. ప్రసాద్, రిలయన్స్ బయోఎనర్జీ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బషీర్ షిరాజీ , ఎండీ ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎం కమలాకర్ బాబు, ఇతర విద్యుత్ సంస్థల సీనియర్ అధికారుల సమక్షం లో రిలయన్స్ ఇండస్ట్రీస్ , రాష్ట్ర ఇంధన శాఖ కు మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది.

ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 ద్వారా ఆకర్షితులై భవిష్యత్తులో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచే విధంగా , ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రాష్ట్రంలోని అందుబాటులో ఉన్న వినియోగానికి ఉపయోగపడని నిరర్థకమైన భూములను ఉపయోగించుకుని రాబోయే 4-5 సంవత్సరాలలో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లను స్థాపించడానికి ముందుకు వచ్చింది. ఒక ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ. 130 కోట్లు తో మొత్తం రూ 65,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడి ద్వారా దాదాపు రాష్ట్రంలో 2,50,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. దీని ద్వారా రానున్న 25 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్ర ఎస్జీఎస్టీ(SGST) , ఎలక్ట్రిసిటీ డ్యూటీ , ఉపాధిపై పన్ను సేకరణ ద్వారా దాదాపు రూ.57,650 కోట్లు రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.

ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు దూరదృష్టితో కూడిన నాయకత్వం, రాష్ట్ర ఆకర్షణీయమైన విధానాలతో, పెట్టుబడిదారులు క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్పై ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సానుకూల విధానాలతో పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని వేగంగా పెంచడంలో నూతన క్లీన్ ఎనర్జీ పాలసీ దోహదపడుతుంది. ఇది ఇంధన భద్రతను పెంపొందించడానికి, ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు , పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి , పర్యావరణాన్ని కాపాడేందుకు కూడా దోహాపడుతుంది.

రాష్ట్రంలో పుష్కలంగా సౌర, పవన వనరులతో ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉండడంతో పాటు పునరుత్పాదక ఇంధన అభివృద్ధిలో రాష్ట్రం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించి, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా 10,000 టన్స్ పర్ డే TPD (రోజుకు టన్నులు) కంప్రెస్డ్ బయో గ్యాస్ను ఉత్పత్తి చేసే లక్ష్యంగా పాలసీ రూపొందించడమైంది.

భవిష్యత్తులో రానున్న CBG ప్లాంట్లతో రైతులు విద్యుత్ సంబంధిత ( నాపియర్ గ్రాస్) పంటలను సాగు చేయడం ద్వారా ఎకరాకు సంవత్సరానికి రూ. 30,000 సంపాదించేందుకు అవకాశం ఉంది . సంవత్సరానికి సుమారు 39 లక్షల MT (మెట్రిక్ టన్ను) CBG ఉత్పత్తి (ప్లాంట్కు 7,800 MT) పారిశ్రామిక వృద్ధికి సహాయం చేయడం ద్వారా రాష్ట్ర GDP ని మెరుగుపరుస్తుంది . 500 ప్లాంట్ల నుండి ఉత్పత్తి చేయబడిన CBG శిలాజ ఇంధనాన్ని గ్రీన్ ఎనర్జీతో ప్రతిరోజు 9.38 లక్షల లైట్ కమర్షియల్ వెహికల్స్ కు (LCVలు) పునరుత్పాదక ఇంధనాన్ని అందిస్తుంది.

CBG ప్లాంట్ల ఏర్పాటు కారణంగా దాదాపు 110 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రీయ ఎరువు ఉత్పత్తి వలన రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా, అధునాతన వ్యవసాయ యంత్రాల ఉపయోగం , ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ (IoT) ఆధారిత అగ్రి-సొల్యూషన్స్, కార్యకలాపాలు ప్లాంట్ పరిసరాల్లోని రైతులకు ప్రయోజనాలను కలిగిస్తాయి.

CBG ప్లాంట్ యొక్క స్థిర మూలధన పెట్టుబడి ఫిక్స్ డ్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (FCI)పై 20% మూలధన రాయితీతో కంప్రెస్డ్ బయో-గ్యాస్ (CBG) ప్లాంట్ వంటి బయో ఎనర్జీ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రోత్సాహకాలను అందిస్తోంది. 5 సంవత్సరాల వ్యవధిలో CBG ప్లాంట్ TPD సామర్థ్యానికి గరిష్టంగా రూ. 1 కోటి రాయితీగా కమర్షియల్ ఆపరేషన్ తేదీ (CoD) తర్వాత ప్రభుత్వం అందిస్తుంది.

CBG, 1G (మొదటి తరం) , 2G (2వ తరం) ఇథనాల్ డెవలపర్లు రాష్ట్రంలో విక్రయించిన నికర SGST ఆదాయంలో 100% CoD నుండి 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం తిరిగి చెల్లించ నుంది. CoD నుండి 5 సంవత్సరాల కాలానికి బయో ఎనర్జీ (CBG, 1G, 2G ఇథనాల్) ఉత్పత్తి కోసం వినియోగించే విద్యుత్ కోసం 100% విద్యుత్ డ్యూటీ రీయింబర్స్మెంట్ కూడా వర్తిస్తుంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF) ద్వారా 5 సంవత్సరాల వ్యవధిలో బయోమాస్ ప్రాసెసింగ్ పరికరాల కోసం సహకార ఏజెన్సీలకు 20% సబ్సిడీ ఇవ్వబడుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ (APIDP) ప్రయోజనాలను ఉపయోగించి నిల్వ సౌకర్యాలతో ఫీడ్స్టాక్ సేకరణ కేంద్రాలను స్థాపించడానికి ఈ విధానం ద్వారా స్థానిక సంస్థలు , రైతులకు ప్రోత్సాహం లభిస్తుంది, ప్రోత్సహిస్తుంది. విద్యుత్ టారిఫ్ రీయింబర్స్మెంట్ యూనిట్ కు రూ. 1/- చొప్పున 5 సంవత్సరాలు అందించబడుతుంది. ఆ తర్వాత కాలానుగుణంగా వర్తించే విధంగా చెల్లించబడుతుంది. కాలపరిమితితో కూడిన చట్టబద్ధమైన అనుమతులను పొందేందుకు సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్ సేవలు అందుబాటులో ఉంచబడతాయి.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *