Breaking News

ఏపీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024పై అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి ప్రకటన

-గ్రీన్ ఎనర్జీ కారిడార్ల ద్వారా ఇంధన వ్యయం తగ్గించడ‌మే లక్ష్యం
-పాలసీ ద్వారా రూ.10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు… 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
-ఐసీఈతో 2047 నాటికి క‌ర్బ‌న ర‌హిత రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్
-ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీతో విద్యుత్ వినియోగం మ‌రింత సుల‌భం
-పెట్టుబడుదారుల‌తో పాటు ల‌బ్ధిదారుల‌కూ అనేక రాయితీలు
-విద్యుత్ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీతో 2047 నాటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని క‌ర్బ‌న్ ఉద్గారాల ర‌హిత రాష్ట్రంగా మారుస్తామ‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. గురువారం శాస‌న‌స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటిగ్రేటెడ్ ఎన‌ర్జీ పాల‌సీని ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 2070 నాటికి దేశాన్ని క‌ర్బ‌న ఉద్గారాల ర‌హితంగా చేయాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ ల‌క్ష్యానికి అనుగుణంగా పాల‌సీని రూపొందించామ‌ని తెలిపారు. ఏపీలో పున‌రుత్పాద‌క‌ ఇంధ‌న త‌యారీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కించడమే కాకుండా పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త ఐసీఈ పాల‌సీని తీసుకొచ్చినట్లు వెల్ల‌డించారు. అదే విధంగా నిర్దేశిత‌ ల‌క్ష్యాల‌ను తాము సాధిస్తామ‌ని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీకు అనుగుణంగా… పెట్టుబ‌డులు పెట్టే కంపెనీల‌కు, వ్యాపారుల‌కు త్వ‌ర‌తిగ‌తిన అనుమ‌తులు మంజూరు చేయ‌డంతో పాటు ప్ర‌త్యేక రాయితీల‌ను కూడా ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి గొట్టిపాటి ప్ర‌క‌టించారు.

ఐసీఈ పాల‌సీతో దాదాపు రూ.10 ల‌క్ష‌ల కోట్ల ప్ర‌తిపాదిత పెట్టుబ‌డులు వచ్చే అవకాశం ఉంద‌ని మంత్రి గొట్టిపాటి ప్ర‌క‌టించారు. దీని ద్వారా దాదాపు 7,50,000 మంది కార్మికుల‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి క‌లుగుతుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిపాదిత పెట్టుబ‌డితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప్ర‌పంచ స్థాయి విద్యుత్ నిల్వ కేంద్రంగా మారడంతో పాటు దేశ ఆర్థిక పురోగ‌తికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని మంత్రి వెల్ల‌డించారు.

ఐసీఈ పాల‌సీతో గ్రీన్ ఎన‌ర్జీ కారిడార్స్ అందుబాటులోకి తీసుకొని రావడం ద్వారా ఇంధ‌న ఖ‌ర్చును త‌గ్గించ‌వ‌చ్చ‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. అదే విధంగా ప్రాజెక్టుల కోసం పెట్టుబ‌డులు, ఎకో సిస్ట‌మ్ ను ప్రోత్సహించ‌డం, త‌ద్వారా ఆర్థిక వ్య‌వ‌స్థ అభివ్రుద్ధికి, ఉద్యోగ అవ‌కాశాల సృష్టికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. పున‌రుత్పాద‌క‌ ఇంధ‌న త‌యారీ, వినియోగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను దేశంలోనే అగ్ర‌గామిగా నిల‌పాల‌న్న ఉద్దేశంతో… కొన్ని ల‌క్ష్యాల‌ను నిర్దేశించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఇందులో భాగంగానే…. 78.5 గిగావాట్ల సోలార్ ఎన‌ర్జీ, 35 గిగావాట్ల విండ్ ఎనర్జీ, 22 గిగావాట్ల పంప‌డ్ స్టోరేజ్, 25 గిగావాట్ ప‌ర్ అవ‌ర్ బాట‌రీ ఎన‌ర్జీ స్టోరేజ్ సిస్ట‌మ్స్, సంవ‌త్స‌రానికి 1.5 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల గ్రీన్ హైడ్రోజ‌న్, రోజుకు 1500 కిలో లీట‌ర్ల ఈథ‌నాల్, రోజుకు 10,000 ట‌న్నుల కంప్రెస్డ్ బ‌యో గ్యాస్ (సీబీజీ)తో పాటు 5000 ప‌బ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేష‌న్లు త‌మ ప్ర‌ధ‌మ‌ ప్రాధాన్య‌త‌గా మంత్రి పేర్కొన్నారు.

నెడ్ క్యాప్ నోట‌ల్ ఎజ‌న్సీగా ఉండే ఐసీఈ పాల‌సీలో భాగంగా కేంద్ర‌ప్ర‌భుత్వ‌, ప‌రిశ్ర‌మ‌ల స‌హ‌కారంతో పీపీపీ విధానంలో యువ‌త‌లో నైపుణ్యాభివ్రుద్ధి కోసం యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ వివ‌రించారు. అదే విధంగా గ్రీన్ ఎన‌ర్జీ, స‌ర్య్కుల‌ర్ ఎకాన‌మిల కోసం యూనివ‌ర్సిటీ ద్వారా శిక్ష‌ణ పొంది నైపుణ్యం సాధించిన వారికి దేశంతో పాటు విదేశాల్లోనూ ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని ఆయ‌న‌ హామీ ఇచ్చారు.

ఐసీఈ పాల‌సీ ద్వారా రాష్ట్రంలో నిరుప‌యోగంగా ఉన్నబంజ‌రు భూముల‌ను వినియోగంలోకి తీసుకువ‌స్తామ‌ని మంత్రి గొట్టిపాటి వివ‌రించారు. కొత్త ఇంటిగ్రేటెడ్ పాల‌సీతో రాష్ట్రంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా వినియోగం మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంద‌ని పేర్కొన్నారు. అదే విధంగా పెట్టుబ‌డుల‌కు సంబంధించిన అనుమ‌తులకు త్వ‌రిత‌గ‌తిన ఆమోదం ల‌భించ‌డంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వ ప్రోత్సాహ‌కాల‌ను అందిపుచ్చుకోవ‌డంలో ఐసీఈ పాల‌సీ ఎంతో ఉప‌క‌రిస్తుంద‌ని చెప్పారు.

రాయితీలు…. ప్రోత్సాహ‌కాలు…
ఐసీఈ ప్రాజెక్టుల‌లో పాల్గొనే వ్య‌క్తులు, కంపెనీల‌కు… అంద‌రికీ లాభ‌దాయ‌కంగా… ఆమోద‌యోగ్యంగా… రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక ప్రోత్సాహ‌కాల‌ను, రాయితీల‌ను అందిస్తుంద‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. భూములు లీజుకు ఇచ్చే వారికి కూడా గ‌తంలో ఏ ప్ర‌భుత్వం ఇవ్వ‌ని ప్రోత్సాకాల‌ను అందిస్తామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు, ప‌ట్టా భూమి దేనికైనా ఎక‌రానికి సంవ‌త్స‌రానికి రూ.31,000 అందిస్తామ‌న్నారు. అదే విధంగా ప్ర‌భుత్వ భూముల్లో ఏర్పాటు చేసే బ‌యో ఫ్యూయ‌ల్ ప్రాజెక్టుల‌కు సంబంధించి… ఎక‌రానికి సంవ‌త్స‌రానికి రూ.15,000 ఇస్తామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ భూముల్లోని ఓడ‌రేవుల్లో… గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ ల ఏర్పాటుకు సంబంధించి సంవ‌త్స‌రానికి ఎక‌రానికి రూ.1,00,000 చెల్లిస్తామ‌ని తెలిపారు. వీటితో పాటు నాలా రుసుమును కూడా మిన‌హాయిస్తామ‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. అదే విధంగా ఆఫ్ రివ‌ర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కోసం సేక‌రించిన భూమికి స్టాంప్ డ్యూటీ నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌డంతో పాటు ఇంటిగ్రేడెట్ గ్రీన్ హైడ్రోజ‌న్ కోసం, ప్లాంట్ అండ్ మెషిన‌రీ కోసం, డీశాలినేష‌న్ ప్లాంట్ కోసం ఎఫ్సీఐపై 20 శాతం మూల‌ధ‌న రాయితీ ఉంటుంద‌ని మంత్రి స్పష్టం చేశారు.

వీలింగ్ ఛార్జీలు…
ఐసీఈ పాల‌సీలోని వీలింగ్ ఛార్జీల గురించి కూడా మంత్రి గొట్టిపాటి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. ఇంజెక్ష‌న్ అండ్ విత‌డ్రాల్స్ ఒకే ఓల్టేజ్ స్థాయిలో ఎలాంటి చార్జీలు ఉండ‌వ‌న్నారు. పీఎస్పీ, మిని అండ్ స్మాల్ హైడ్రో, బ్యాట‌రీ ఎన‌ర్జీ స్టోరేజ్ సిస్ట‌మ్స్, గ్రీన్ హైడ్రోజ‌న్ మ‌రియు బ‌యో ఫ్యూయ‌ల్ కు ఎల‌క్ట్రిసిటీ డ్యూటీ తిరిగి చెల్లిస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. అదే విధంగా పీఎస్పీల‌కు వాట‌ర్ సెస్ మిన‌హాయించ‌డంతో పాటు నీటి కేటాయింపుల్లోనూ ప్రాధాన్య‌త ఇస్తామ‌ని మంత్రి గొట్టిపాటి ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *