-శాసన సభ లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత వైసీపీ ప్రభుత్వ హయంలో 2021లో తీసుకు వచ్చిన విద్యుత్ సుంకం చట్టం వల్ల వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడిందని, దానిని సరిదిద్దడానికే… విద్యుత్ సుంకం 2వ సవరణ 2024 చట్టాన్ని తీసుకువచ్చినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్ -2024 ఆమోదానికి సభ అనుమతి కోరుతూ.. శుక్రవారం శాసనసభ లో ప్రవేశపెట్టిన సందర్భంగా… మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు. విద్యుత్ సుంకం 2వ సవరణ చట్టం 2024 ద్వారా… వినియోగదారులపై కొత్తగా ఏటువంటి అదనపు భారం పడదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. 2021 అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం ద్వారా అడ్డగోలుగా విద్యుత్ సుంకం వసూలు చేశారని ఆయన విమర్సించారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పులను సరిదిద్దడానికి కొత్తగా తీసుకు వచ్చిన ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్ -2024 అవకాశం కలిపిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి… వివిధ వర్గాల వారికి విద్యుత్ సుంకాన్ని ఏ విధంగా విధించాలో కొత్త విద్యుత్ సుంకం 2వ సవరణ చట్టం ద్వారా నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా గత వైసీపీ ప్రభుత్వం వసూలు చేసిన సుంకం మరలా తిరిగి చెల్లించకుండా… ప్రజలపై భారం లేకుండా… పలు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. దీనితో పాటు భవిషత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే విధంగా సవరణలు చేసుకునే వెసులు బాటు కూడా కొత్త సవరణ చట్టం లో ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.