-మద్రాసు ఐఐటీ ప్రతినిధుల ప్రశంస
-ఆర్టీజీఎస్ పనితీరును వివరించిన సీఈఓ దినేష్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ రంగంలో ఆర్టీజీఎస్ లాంటి సాంకేతిక వ్యవస్థ ఉండటం అద్బుతమని, ఇదో వినూత్న ఆలోచన, దీని పనితీరు అందరికీ ఆదర్శప్రాయమని మద్రాసు ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీళినాథన్ కామకోటి అన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని మద్రాసు ఐఐటీకి చెందిన ప్రతినిధుల బృందం సందర్శించింది. ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ లు రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటు, దాని ఆశయాలు, ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంలో ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వినూత్న ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీజీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఆర్టీజీఎస్‌తో అనుసంధానించబడి, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోందని అధికారులు వివరించారు. పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వానికి అందే వినతులను రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తున్నామని వివరించారు. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే ముఖ్యమంత్రిగారి ఆశయమని ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్టీజీఎస్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తదితర అత్యాధునిక సాంకేతికలను ఉపయోగించుకుని ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షిస్తోందని చెప్పారు. అనంతరం మద్రాసు ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీళినాథన్ కామకోటి మట్లాడుతూ ఒక ప్రభుత్వ వ్యవస్థలో రియల్ టైమ్ గవర్నెన్స్ లాంటి సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడం వినూత్నమని, ఆర్టీజీఎస్ తో కలిసి పనిచేయడానికి మద్రాసు ఐఐటీ సిద్ధంగా ఉందని తెలిపారు.