అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పూర్తిగా ధ్వంసమైన పలు రాష్ట్ర రహాదారులు, జిల్లా ప్రధాన రహదారులు, ఇతర జిల్లా రహదారులకు సంబంధించి మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మరమ్మతు పనులను వేగవంతం చేసేందుకు నేడు 3 జీవోలను సైతం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అదే సమయంలో వేగంగా రోడ్ల మరమ్మతులను పూర్తి చేయడానికి 7 రోజుల వ్యవధిలో షార్ట్ టర్మ్ టెండర్లు కూడా ఆహ్వానిస్తోన్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో రోడ్లను గుంతల రహిత రహదారులు మార్చడానికి, అదే విధంగా రాష్ట్ర హైవేలు, జిల్లా ప్రధాన రహదారుల వెంబడి పెరిగిన ముళ్ల కంపలను తొలగించడానికి మొత్తంగా రూ. 210 కోట్లు ఇప్పటికే కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే 1839 పనులకు గానూ 198.84 కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.11.16 కోట్లకు సంబంధించిన పనుల ప్రతిపాదనలు మరో దశలో కేటాయించనున్నారు. ఈ రూ. 198.84 కోట్లలో రాష్ట్ర హైవే పనులకు సంబంధించి రూ. 50.46 కోట్లు, జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి రూ.148.38 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మొత్తం 1839 పనుల్లో 687 మైనర్ మరమ్మతులు, 473 తీవ్రమైన గుంతలు, 679 ముళ్ల కంచెలకు సంబంధించిన పనులు ఉన్నాయన్నారు.. ఈ పనులను 3 దశలలో చేపట్టడానికి ఇప్పటికే ప్రతిపాదించడం జరిగిందన్నారు.
అలాగే జిల్లా ప్రధాన రహదారులు, మరియు రాష్ట్ర హైవేలకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద రూ.140 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 1766 కి.మీ గానూ 350 పనుల కోసం రూ.92.75 కోట్లు, రాష్ట్ర హైవేలకు సంబంధించి 796 కి.మీ గానూ 128 పనుల కోసం రూ. 47.25 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.
ఆగష్టు – సెప్టెంబర్ నెలల్లో వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా ధ్వంసమైన రాష్ట్ర హైవేల్లో సీడీ వర్క్ లు మరియు జిల్లా ప్రధాన రహదారులను శాశ్వత ప్రాతిపదికన తిరిగి పునర్ నిర్మించడానికి డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద రూ. 220.41 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో రాష్ట్ర హైవేలకు సంబంధించి రూ.102.30 కోట్లతో 75 పనులను… జిల్లా ప్రధాన రోడ్లకు సంబంధించి 118.10 కోట్లతో 145 పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.
అలాగే ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిన రూ. 290 కోట్లలో.. మంజూరైన రూ. 283 కోట్లతో ప్రస్తుతం 1650 పనులను ప్రారంభించగా, దానిలో దాదాపుగా 700 కి.మీ మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.. రానున్న కాలంలో మరింత వేగంగా మరమ్మతు పనులను పూర్తి చేయడం ద్వారా సంక్రాంతి నాటికి గుంతల రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags amaravathi
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …