గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలో వీధులలో సచరించు ఆవులు, దూడలు, గేదెలు, ఎద్దులు నియంత్రణ కొరకు శానిటరీ ఇన్ స్పెక్టర్ల పర్యవేక్షణలో 4 ప్రత్యేక టీములను ఏర్పాటుచేసి ప్రతీరోజు 2 వాహనములలో పట్టి వెంగళాయిపాలెం నగర పాలక సంస్ధ వారు ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి బందెలదొడ్డి నిర్వహణ జరుగుచున్నది.
వీటి సంరక్షణ కొరకు ఆరుగురు వర్కర్లను నియమించి పశుగ్రాసము, మంచినీరు, వైద్యము, ఆహారము అందించుట జరుగుచున్నది. నగర పాలక సంస్ధ చేపడుతున్న ప్రత్యేక చర్యలలో భాగంగా ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ప్రజలకు అసౌకర్యం కలుగకుండా, వాహన చోదకులకు సమస్యలు తలెత్తకుండా వీధులలో సంచరించు ఆవుల యజమానులకు ది.16-11-2024 తేదీన కమీషనరు ఛాంబరు నందు తూర్పు శాసన సభ్యులు నజీర్ అహ్మద్ నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులతో సమావేశము నిర్వహించుట జరిగినది. ఆవులు, దూడలు, గేదెలు, ఎద్దులు యజమానులు వారి యొక్క స్వంత స్ధలములో మాత్రమే ఉంచుకొనవలసినదిగా కోరడమైనది, వీధులలో వదిలిన యెడల వాటిని పట్టి బందెలదొడ్డికి తరలించుట జరిగుననియూ, పట్టిన వాటిని విడిపించుకోవాలంటే వాటి యజమాని ఆధార్ కార్డు, నోటరీ, సచివాలయ సిబ్బంది విచారణ రిపోర్టు ఆధారంగానే వారివి అని నిర్ధారించిన తదుపరి అపరాధ రుసుముతో వదిలివేయుట జరుగును. మరలా అదే ఆవుని వీధులలో వదిలినయెడల యజమానికి అప్పగించబడదు, పట్టిన ఆవు కొరకు 10 రోజుల వరకు ఎవరూ రాని యెడల దానిని వీధి ఆవుగా పరిగణించి మున్సిపల్ చట్టము సెక్షన్ 510 ప్రకారము వేలం నిర్వహించబడును.
గత 10 రోజులలో నగర పాలక సంస్ధ సిబ్బంది 109 ఆవులను పట్టుట జరిగినది. యజమానుల సమావేశములో కమీషనరు మున్సిపల్ నిబంధనల ప్రకారము వారిపై తగు చర్యలు ఉంటాయని కాబట్టి గో-యజమానులు నగర పాలక సంస్ధకు సహకరించి వీధులలో వదలకుండా చూసుకొనవలసినదిగా హెచ్చిరించినారు.
ఈ సమావేశమునకు ప్రభుత్వ పశు వైద్య జాయింట్ డైరక్టర్ మరియు డిప్యూటీ డైరక్టర్ హజరయి ప్రస్తుతము వీధులలో సంచరిస్తున్న జంతువులకు లంప్ స్కిన్ అను వైరస్ ప్రబలి ఉన్నదని, దానివలన మరణాలు సంభవిస్తాయిని వాటికి ఉచితంగా వ్యాక్సిన్ వేయబడునని, వాటిని ఉంచు ప్రదేశములు దోమలు, ఈగలు రాకుండా మెష్ లు వాడాలని, చుట్టు ప్రక్కల పరిశరాలు సున్నం, బ్లీచింగ్ చల్లుకొనవలసినదిగా సూచించినారు.
సదరు సమావేశములో వెటర్నరీ వైద్యాధికారులు, నగర పాలక సంస్థ సి,య,హెచ్.ఓ డాక్టర్ శోభారాణి, యం,హెచ్.ఓ డాక్టర్ రవి కుమార్, ప్రజారోగ్యశాఖాధికారులు పాల్గొన్నారు.