Breaking News

సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి…

-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
-నేడు ఇళ్ళ స్థలాల కోసం సచివాలయాల్లో వినతి పత్రాలు సమర్పణ
-రేపు విజయవాడలో విద్యుత్‌ చార్జీలు తగించాలని వామపక్ష పార్టీల నిరసన

నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక హనుమాన్‌పేట దాసరి భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు నదుల అనుసంధానం గురించి మాట్లాడుతుంటే… మరోవైపు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఎత్తు తగ్గిస్తే ఆ ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే రూ.25 వేల కోట్లు కేంద్రానికి ఆదా అవుతుందన్నారు. కుడి, ఎడమ కాల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తున్నారని, దీంతో నిధులు ఆదా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర చర్యల వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు. సీఎం చంద్రబాబు ఈ అంశంపై స్పష్టత ఇవ్వడం లేదని, కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా ట్రైబ్యునల్‌ మొదటి కేటాయింపులు చేసిందన్నారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా కేటాయింపులు తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై పారదర్శకంగా చర్చ జరగాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఈ విషయంపైన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానికారణంగా ప్రజా సమస్యలు చర్చకు రావటం లేదన్నారు. అందువల్ల చంద్రబాబు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

ఇళ్ల స్థలాల సాధనకు నేడు సచివాయాల్లో వ్యక్తిగత అర్జీలు సమర్పణ:
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు నివేశన స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం సీపీఐ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాయని చెప్పారు. ఈ నెల 18వ తేదిన ఇళ్ల లబ్దిదారులు సచివాలయాల్లో వ్యక్తిగత అర్జీలు సమర్పించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ శ్రేణులు ఇళ్ల లబ్దిదారులకు సహకారం అందిస్తారని చెప్పారు. ఇళ్ల స్థలాల అంశాన్ని గతంలో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుతాన్ని సీపీఐ విన్నవించినా లెక్కచేయలేదన్నారు. ఒక్కో కుటుంబానికి ఒక్క సెంటు స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణానికి లక్షా ఎనభైవేలు మాత్రమే ఇచ్చిందన్నారు. చాలా చోట్ల ఇళ్ల స్థలాల లే అవుట్లు అసంపూర్తిగా ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందన్నారు. ఇసుక, ఇటుక, ఇనుము, కంకర ధరలు పెరిగిన కారణంగా ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లబ్దిదారులను భారీ ఎత్తున సమీకరించి అన్ని సచివాలయాల్లో పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పించేలా సీపీఐ నాయకత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

రేపు విద్యుత్‌ చార్జీలను వ్యతిరేకిస్తూ విజయవాడలో వామపక్ష పార్టీల నిరసన:
ఎఫ్‌పీపీసీఏ చార్జీల పేరిట ప్రజలపై రూ. 6,072 కోట్ల భారాన్ని విధిస్తూ ఏపీ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వును వెంటనే ఉపసంహరించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మరో రూ.11820 కోట్ల విద్యుత్‌ సర్దుబాటు చార్జీల పెంపుపై ఏపీఈఆర్‌సీ విధించిన అభ్యంతరాల గడువును నవంబర్‌ 19 వరకు ఇచ్చిందని, సీపీఐ తన అభ్యంతరాలను తెలియజేస్తుందన్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ చార్జీలను పెంచబోమని, వీలైతే తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు దాదాపు రూ.18 వేల కోట్ల విద్యుత్‌ భారాలను రాష్ట్ర ప్రజలపై మోపేందుకు సిద్ధమవ్వడంపై విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా ఇంత పెద్దఎత్తున ఏనాడూ విద్యుత్‌ భారాలను మోపలేదన్నారు. అసలే ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న ప్రజలపై వేలకోట్ల భారాలను మోపడం దుర్మార్గం అన్నారు. విద్యుత్‌ సర్దుబాటు చార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నవంబర్‌ 19న పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల 20 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి, విద్యుత్‌ చార్జీల భారాలపై ప్రజలను చైతన్యపరచనున్నట్లు వివరించారు.
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పినా ఎవరూ ధరలు తగ్గించటం లేదన్నారు. మంత్రుల మాటలు ఎవరూ ఖాతర్‌ చేయటం లేదన్నారు. ఉచిత ఇసుక పథకాన్ని నిర్వీర్యం చేశారని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకను నల్లబజారుకి తరలించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *