-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మ్యాప్ ల ఆధారంగా డ్రైన్ లు పరిశుభ్రపరచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 9వ డివిజన్ బెంజ్ సర్కిల్ నుండి స్క్రూ బ్రిడ్జ్ వరకు సర్వీస్ రోడ్లో కమిషనర్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైడ్ డ్రైన్లో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, వర్షపు నీటి నిలువలు రోడ్డుపైన నిలువకుండా ఉండేందుకు సైడ్ కాలవలను పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైన్ క్రాసింగ్ ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిశుభ్రపరచాలని, ప్రతి డివిజన్లో డ్రైన్ లను మ్యాప్ల ఆధారంగా పరిశుభ్రపరుస్తూ ఒక డివిజన్లో ఉన్న డ్రైన్లు అన్నిటినీ పరిశుభ్రపరిచేటట్టు చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేసుకుంటూ ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తీసివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి సామ్రాజ్యం, వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.