-ఎన్‌టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని ప్రతిఒక్కరికీ అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలతో అనుసంధానం చేసి తత్వజ్ఞానాన్ని
అందించేందుకు, తన కీర్తనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు విశేష కృషిచేసిన కవి, సంగీతకారుడు, స్వరకర్త శ్రీ భక్త కనకదాస జీవితం ఆదర్శప్రాయమని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు.
శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా.. కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కన్నడ కురుబ కుటుంబంలో జన్మించిన కనకదాస విద్య ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి సమాజాన్ని అన్ని కోణాల్లో సూక్ష పరిశీలన చేసి, అర్థం చేసుకొని వైవిధ్య రచనలు చేసి సమాజానికి దిశానిర్దేశం చేశారని.. ఆయన మనకు అందించిన జ్ఞానాన్ని వారసత్వ సంపదను మన ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని నిధి మీనా అన్నారు.
కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, జిల్లా ఇన్‌ఛార్జ్ బీసీ సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ జి.ఉమామహేశ్వరరావు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీసీహెచ్ఎస్ డా. బీసీకే నాయక్ తదితరులు పాల్గొన్నారు.