Breaking News

స్వయం కృషితో అందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చా

-దేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా స్వచ్ఛాధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దుతా
-విలువలతో కూడిన జీవితాన్ని నేర్పింది నా తండ్రి- అదే నా ఎదుగుదలకు కారణం
-నేటి యువత ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలి
-స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి యువత సామాజిక స్రృహ కలిగి ఉండటంతోపాటు ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాల్సిన అవసరం ఉందని స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ గా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వేలాది మంది అభిమానుల మధ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ మా తండ్రి కొమ్మారెడ్డి దుర్గా ప్రసాద్ క్రమశిక్షణతో నన్ను పెంచారన్నారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనం, పత్రికలు చదవటం పై గురించే కాకుండా దేశ, విదేశాల్లో జరిగే వర్తమాన విషయాలు మాకు చెప్పేవారన్నారు. స్వర్గీయ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు పై అభిమానంతో కుటుంబంలో అందరం పనిచేసామన్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పోలింగ్ ఏజెంట్ వరకు వివిధ స్థాయిల్లో నేను పనిచేసానన్నారు. నేటి యువతలో ఫైర్ అనేది లేకుండా పోతుందని, సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించడంతోపాటు ఎదురొడ్డి పోరాడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2012 లో ప్రారంభించిన పాదయాత్ర తో నా రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు. గత ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన నెల నుంచే రాష్ట్రాన్ని లూటీ చేయడం ప్రారంభించిందని, ప్రజలను ఇబ్బందికి గురిచేయడంతో నా గళం వినిపించానన్నారు. నేను ఎప్పుడూ నిరాధారంగా, అసత్య ఆరోపణలతో మాట్లాడలేదని, వాస్తవాలను చూపిస్తూ ఘాటుగానే మాట్లాడానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వాస్తవాలను మాట్లాడాలని ఎప్పడూ చెపుతారన్నారు. ఆయన చూపిన మార్గదర్శకత్వంలోనే ముందుకు వెళ్లుతున్నామన్నారు. రాజకీయాల్లో ఎవరైనా రాణించగల్గుతారని, చదువుకున్న వారు కొద్దిమంది అయినా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 12 సంవత్సరాల నుంచి నన్ను నేను నిరూపించుకునేందుకు కృషి చేస్తున్నానన్నారు. స్వయం కృషితో అందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చానన్నారు. చెత్త నుంచి సంపద తయారీతోపాటు విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజులపాటు ఏదైనా గ్రామంలో చెత్త తీయడం మానేస్తే ఆ గ్రామంలో ఉండలేమన్నారు. అలాంటి చెత్తపై పన్ను వేసారన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా కేంద్రం నుంచి నిధులు ఎక్కువ వచ్చేలా కృషి చేస్తానన్నారు. రాజకీయ క్రీడా మైదానంలో మొన్నటి వరకు చెత్తను క్లీన్ చేశానని, నేడు రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేసే బాధ్యత ముఖ్యమంత్రి నాకు అప్పగించారని, దానికి నా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. వచ్చే అక్టోబర్ 2, గాంధీ జయంతి నాటికి దేశంలోనే రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రలో నెంబర్ 1 గా చేస్తానన్నారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర ఛైర్మన్ గా పట్టాభి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. యువత ను ప్రోత్సహించే విధంగా చంద్రబాబు పదవులు ఇస్తున్నారని, వచ్చే ముప్పై యేళ్లల్లో కమిట్ మెంట్ తో యువత పని చేసేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. గత ఐదేళ్లల్లో అరాచకాలు అందరూ చూశారని, జగన్ ప్రభుత్వం పై ధైర్యం గా గళమెత్తిన వ్యక్తి పట్టాభి అన్నారు. ఇంటి‌పై దాడి చేసినా, అక్రమ అరెస్టు చేసినా భయపడలేదన్నారు. నాకు సంబంధం లేని కేసులో నన్ను అరెస్టు చేసి 54 రోజులు జైల్లో పెట్టారన్నారు. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా లు గత పదేళ్లు గా ఎన్నో‌ పోరాటాలు చేశారని, కమిట్మెంట్ తో నిలబడి పనిచేసిన వారిని ముఖ్యమంత్రి తప్పకుండా గుర్తించి తగిన సమయంలో పదవులిస్తారన్నారు. ప్రధాని, సిఎం లకు ఇష్టమైన అంశం స్వచ్ఛ సంకల్ప్ అని వారి సారధ్యంలో పట్టాభి మంచి పని తీరుతో ప్రజలకు సేవ చేస్తారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ ల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టాభి గత ప్రభుత్వం అరాచకాలను ధైర్యంగా ఎదిరించారన్నారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయ పడలేదన్నారు. కమ్మిట్ మెంట్ తో పని చేసిన పట్టాభికి ఈ పదవి ఇవ్వడం చాలా ఆనందం‌ కలిగించిందన్నారు. పార్టీ కోసం పని చేసే వారిని అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందన్నారు. పట్టాభి కి అప్పగించిన బాధ్యత లు తనదైన శైలిలో ప్రజలకు సేవలు అందిస్తారని ఆశిస్తున్నాన ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
ఆర్టీసీ మాజీ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ గత 5 ఏళ్లల్లో ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ఆ అఘాయిత్యాలను ఎదురొడ్డి నిలబడిన వ్యక్తి పట్టాభి రామ్ అన్నారు. రాష్ట్రమంతా నిండిపోయిన బురద, చెత్తను తొలగించడానికి ముఖ్యమంత్రి ఒక మంచి పనిని పట్టాభి కి అప్పగించారన్నారు. వ్యక్తిగతంగా దాడిచేసినా, తన ఇంటిపై దాడి చేసినా పట్టాభిలో పోరాట పటిమ తగ్గలేదని, మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లార ని వర్ల రామయ్య అన్నారు.
పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) మాట్లాడుతూ వేదిక పై ఉన్న నాయకుల అందరి కృషి వల్ల నేను పార్లమెంటు సభ్యునిగా ఇక్కడ ఉన్నానన్నారు. మైనారిటీ సభలో ఉర్దూలో పట్టాభి మాట్లాడిన తీరు నన్ను ఆకట్టుకుందన్నారు. అతని పోరాట పటిమ ద్వారా నేడు ఈ స్థాయికి పట్టాభి ఎదిగారన్నారు.
శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ గా అర్హత ఉన్న వ్యక్తి పట్టాభి రామ్ అన్నారు. దీనికన్నా ఇంకా మంచి పదవికి కూడా పట్టాభి కి అర్హత ఉందని, పరిస్థితులు బట్టి అధిష్టానం పట్టాభి కి ఈ‌ కీలక బాధ్యత లు ఇచ్చిందన్నారు.
శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ గత ఐదేళ్లల్లో పట్టాభి చాలా బాగా పని చేశారన్నారు. గత ప్రభుత్వ అరాచకాల‌పై గళం విప్పారన్నారు. ఎన్నో దాడులు, తిట్లు తట్టుకుని ధైర్యంగా నిలబడి పోరాడిన పట్టాభిని అభినందించారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు అశోక్ బాబు, శాసనసభ్యులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ జెడ్ పి చైర్ పర్సన్ గద్దె అనురాధ, నాయకులు మన్నం మోహన్ కృష్ణ, నాగుల్ మీరా, మాల్యాద్రి, బాలకోటయ్య, రఫీ,, అభిమానులు తదితరలు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *