– పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 97 అర్జీలు.
– జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా అందే ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డా. నిధి మీనా.. డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను ఏరోజుకారోజే ఓపెన్ చేయాలని, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషిచేయాలని సూచించారు. జిల్లాస్థాయిలోనే కాకుండా మండల, మునిసిపల్, డివిజనల్ స్థాయిలోనూ అర్జీల స్వీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినందున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మొత్తం 97 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 38, పోలీస్ 14, మునిసిపల్, పట్టణాభివృద్ధి 14, వైద్య ఆరోగ్యం 6, మార్కెటింగ్ 6, పంచాయతీరాజ్ 5, ఉపాధి కల్పన 2, ఏపీసీపీడీసీఎల్ 2, బ్యాంకింగ్ సేవలకు సంబంధించి రెండు అర్జీలు రాగా పౌర సరఫరాలు, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ధి, ఏపీఈడబ్ల్యూఐడీసీ, డ్వామా, డీఆర్‌డీఏ, సహకార, సాంఘిక సంక్షేమానికి సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.