మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించుటకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల తో పాటు ఈ సంవత్సరం గత నెలల్లో జరిగిన ప్రమాదాలతో పోలిస్తే ఈసారి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రహదారి ప్రమాదాలు తగ్గాయన్నారు. గత సెప్టెంబర్ మాసంలో 53 ప్రమాదాలు జరుగగా, అక్టోబర్ మాసంలో 54 ప్రమాదాలు జరిగాయన్నారు.
జిల్లాలో ప్రమాదాలు జరిగే 61 బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగిందని, అందులో 13 మినహా మిగిలినవన్నీ ప్రమాదాల జరక్కుండా సరిచేయడం జరిగిందన్నారు. జాతీయ రహదారిలో ఉన్న ఆ మిగిలిన 13 బ్లాక్ స్పాట్స్ కూడా వచ్చే సమావేశంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సరి చేసిన బ్లాక్ స్పాట్లను దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తించకుండా సంచార పెట్రోలింగ్ వాహనం ద్వారా తనిఖీ చేయాలన్నారు.
నెలకోసారి సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ జాతీయ రహదారులకు సంబంధించి గత నెలలో పెండింగ్లో ఉన్న చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై సరైన సమాచారంతో రాకపోవడం సముచితం కాదని స్పష్టం చేస్తూ ఇకపై వచ్చే సమావేశానికైనా పూర్తి వివరాలతో నివేదిక తీసుకుని రావాలన్నారు. రహదారులు భవనాల శాఖ పరిధిలో గుర్తించిన 3 బ్లాకు స్పాట్లకు సంబంధించి 1.115 కోట్ల రూపాయల మేరకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు రాష్ట్ర రహదారి భద్రత సంస్థకు పంపించడం జరిగిందన్నారు. జిల్లాలోని మచిలీపట్నం నగరంతో పాటు గుడివాడ, పెడన,ఉయ్యూరు, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీల పరిధిలో వివిధ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రార్థన మందిరాల వద్ద రహదారి భద్రత సూచికల ఏర్పాటు కోసం 80 లక్షల రూపాయల మేరకు ప్రతిపాదనలను రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కు పంపడం జరిగిందన్నారు.
జిల్లాలో 2022 నుండి ఇప్పటివరకు మొత్తం హిట్ రన్ కేసులు 79 గుర్తించామని, అందులో 45 కేసులను జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపడం జరిగిందని, అందులో రెండు క్లేయిములు పరిష్కారమై డబ్బులు సంబంధిత లబ్ధిదారులకు జమైందన్నారు. తహసిల్దార్ల వద్ద విచారణ దశలో ఉన్న పెండింగ్ కేసుల నివేదికలను త్వరగా తెప్పించాలన్నారు.
మచిలీపట్నం డిఎస్పి అబ్దుల్ సుభాని మాట్లాడుతూ గత నాలుగు రోజుల కిందట విజయవాడ మచిలీపట్నం రహదారి మార్గంలో దావులూరు టోల్ ప్లాజా దగ్గర ఒక పోలీస్ రహదారి ప్రమాదంలో చనిపోయారని సి సి ఫుటేజ్ లు కోరితే లేవని చెప్పడం జరిగిందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఎందుకలా చేస్తున్నారని సీసీ కెమెరాలు పనిచేసేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల పిడి శ్రీధర్ రెడ్డి, జిల్లా రవాణా ఇన్చార్జి అధికారి శ్రీనివాస్ నాయక్,ఆర్టీసీ డిఎం పెద్దిరాజు,ఆర్ అండ్ బి ఈఈ లోకేష్ , మోర్త్ టీమ్ లీడర్ సుధీర్, ఎం వి ఐ సిద్ధిఖ్ తదితర అధికారులు బీమా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు