-4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్
-జమైకా అపార్టుమెంట్ వాసుల సమస్య పరిష్కారానికి కృషి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజా సమస్యల పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌లో ఏపీఐఐసీ కాలనీలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, ఎంపీ కేశినేని శివనాథ్, మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్రతో కలిసి మంగళవారం ఉదయం పర్యటించారు. జమైకా అపార్ట్మెంట్ వాసులకు ఎప్పటినుంచో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే తెలుగుదేశం పార్టీ ముఖ్య లక్ష్యమని చెప్పారు. జమైకా అపార్ట్మెంట్ వాసులు ఎప్పటి నుంచో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సమస్యలను అసలు పట్టించుకోలేదన్నారు. ఐలాకు జమైకా అపార్ట్మెంట్ వాసులకు మధ్య చిన్న గీత వంటి సమస్య వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పారు.అందువల్లనే తాను, ఎమ్మెల్యే గద్దె రామ మోహన్, మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించడానికి చూస్తున్నామని తెలిపారు . ఈ సమస్యను అతి త్వరలోనే పరిష్కరించి జమైకా అపార్ట్మెంట్ వాసులకు తాగునీటిని అందిస్తామని అన్నారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ డివిజన్‌లోని జమైకా అపార్టుమెంట్‌లో సుమారు 500 కుటుంబాల నివాసం ఉంటున్నాయని, వారి సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యత అని తెలిపారు. ఐలా, మున్సిపల్ కమీషనర్ కూర్చుని సమస్యలపై చర్చించుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
అధికారులు కూర్చుని చర్చించుకున్నా పరిష్కారం కాకపోతే మంత్రి లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఈ సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. జమైకా అపార్ట్మెంట్ వాసులకు తాగునీరు అందించే బాధ్యత ఎమ్మెల్యేగా తనపై, ఎంపీగా కేశినేని శివనాథ్‌పై ఉందన్నారు. తప్పకుండా జమైకా అపార్ట్మెంట్ వాసులకు తాగునీటిని అందిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే ఉందన్నారు. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతోనే వీరికి తాగునీటిని అందిస్తామని చెప్పారు. అతి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, గొల్లపూడి నాగేశ్వరరావు, పాతూరి సాంబశివరావు, సుంకర దుర్గా ప్రసాద్, ఎస్ ఈ. శేషుకుమార్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు శ్రీనాథ్ రెడ్డి, సామ్రాజ్యం తోపాటు స్థానిక పెద్దలు కోడూరు ఆంజనేయ వాసు, పచ్చలరావు సీతారామయ్య, ఈడ్పుగంటి వేణుగోపాలరావు, త్రిపురనేని చందు, షేక్ జానీ, బర్మా రమేష్ తదితరులు పాల్గొన్నారు.