-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారులపై టోల్‌టాక్స్ విధించాలన్న ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. జాతీయ రహదారుల తరహాలో రాష్ట్రంలోని రోడ్లను ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించి, రోడ్లపై టోల్‌టాక్స్ వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సరైందికాదు. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు, గోతులను పూడ్చడానికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారులకు సైతం టోల్‌టాక్స్ విధించాలనుకోవడం, పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అమలు చేయాలనుకోవడం ‘విజనరీ’ అనిపించుకోదు. ఈ నిర్ణయం పూర్తిగా ప్రైవేటీకరణకు దారులు వేస్తున్నట్లుగా ఉంది. రహదారుల మరమ్మత్తులకు కూడా గ్రామీణ ప్రాంత ప్రజల నుండి పన్నుల పేర వసూలు చేయాలనుకోవడం దుర్మార్గం. ఎపీలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందనీÑ కూటమి ప్రభుత్వం అధికారంలోకొస్తే గుంతలు, గోతులు పడిన రోడ్లకు మరమ్మత్తులు చేపట్టి, బాగుచేస్తామని గత ఎన్నికలకు సందర్భంగా చంద్రబాబు చెప్పడం జరిగింది. కాని అధికారం చేపట్టాక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారులకు లక్షల సంఖ్యలో పడిన గుంతలు పూడ్చేందుకు, రోడ్లకు మరమ్మత్తులు చేపట్టేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులేదనీ, అందువల్ల ఆయా పనులను ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించి, యూజర్ చార్జీలు వసూలు చేయాలనుకోవడం ప్రజలకిచ్చిన మాట తప్పడమే. ఇప్పటికే విపరీతమైన పన్నుల భారాలతో సతమతమవుతున్న ప్రజలపై మరో గుదిబండ మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవ్వడం తగదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌టాక్స్ వసూలు సిపిఐ మొదటనుండీ వ్యతిరేకిస్తున్నది. ఇప్పుడు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత రహదారులపై టోల్‌గేట్లు ఏర్పాటుచేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది. అంతేకాక ప్రైవేటు ఏజన్సీలచేత రోడ్ల నిర్వహణ చేపట్టాలనుకోవడాన్ని నిరసిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర రహదారులపై టోల్‌టాక్స్ విధింపు, రోడ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించే నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధిపట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని, సంపద సృష్టించేందుకు అనువైన మార్గాలు అన్వేషించాలేగాని, ప్రతి సమస్యకు ప్రైవేటీకరణ, ప్రజలపై పన్నుల భారాలు పరిష్కారం కాదనే విషయాన్ని గుర్తెరగాలని కోరుతున్నాం.