Breaking News

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం

-నాకు అధికారం, సీఎం కుర్చీ కొత్తకాదు… ప్రజలు నమ్మకంతో గెలిపించారు
-వాట్సాప్ ద్వారా త్వరలో 150 సేవలు అందుబాటులోకి
-వాట్సాప్ లో మెసేజ్ పెట్టగానే రైతుల నుండి ధాన్యం కొనుగోలు
-రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు దీపం-2 పథకానికి అర్హులే
-శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటాం
-క్షేత్రస్థాయిలో త్వరలోనే ప్రజలతో ముఖాముఖి
-గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను కూటమి ప్రభుత్వంలో గాడినపెడుతున్నాం
-శాసన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం. పేదల ఆదాయం పెరగాలి..ఖర్చులు తగ్గాలి. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలే ధ్యేయంగా పని చేస్తాం. సూపర్-6, మేనిఫెస్టో హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. సంక్షేమం ప్రారంభమైంది టీడీపీ ఆవిర్భావంతోనే. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ఉండాలనేది ఎన్టీఆర్ ఇచ్చిన నినాదం. ఎన్టీఆర్ రూ.2 లకే కిలో బియ్యం ప్రవేశపెట్టారు…అది ఇప్పుడు దేశం మొత్తం అమలైంది. పేదలకు పింఛను రూ.30లతో ప్రారంభించారు. రైతులను ఆదుకునేందుకు రూ.50 లకే హార్స్ పవర్ విద్యుత్ అందించాం. పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు…పక్కా ఇళ్లని ఆలోచించి ఇళ్లు కట్టించారు. సగం ధరకే జనతా వస్త్రాల పంపిణీ చేశారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 162 రోజుల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రసంగించారు.

అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు
ఏపీకి సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఎన్నికలు, ప్రజాతీర్పు కొత్తకాదు. కానీ మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లో వచ్చిన చైతన్యం తిరుగుబాటుగా చెప్పాలి. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు ఎంతటి సునామీ సృష్టించిందో మొన్నటి ఎన్నికలు కూడా అంతే ప్రభంజనం సృష్టించాయి. ప్రజలు నమ్మకంతో, బాధ్యతతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే గట్టి సంకల్పంతో తీర్పునిచ్చారు. ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి…వారి అంచనాలు అందుకునేలా పని చేయాల్సి బాధ్యత ఉంది. ఏపీ చరిత్రలో ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. సమైక్య రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, నవ్యాంధ్రలో ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను. ప్రజలు కోసం, వారి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న నన్ను 4 దశాబ్ధాలుగా ఆదరించారు. 1978లో ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుండే ప్రజల కోసం పని చేయడం, అనునిత్యం అధ్యయనంతో నిత్య విద్యార్ధిగా నేర్చుకుని ప్రజలకు న్యాయం చేయాలని ముందుకొచ్చాం. 46 ఏళ్లుగా ఎన్నో పదవులు, కష్టాలు చూశాను…అవమాన పడ్డాను. 24 క్లేమోర్స్ తో దాడి చేస్తే వెంకటేశ్వరస్వామి పునర్జన్మనిచ్చారు. ఇదే సభలో నాపై దారుణంగా మాట్లాడి, మా కుటుంబ సభ్యులను అవమాన పరిచినప్పుడు బాధ, ఆవేదన కలిగాయి. అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. నేను ఏ తప్పూ చేయలేదు…చేయను. అనుక్షణం ప్రజల కోసమే పని చేస్తా. ఇబ్బందులు పెట్టినప్పుడు మరింత మనోధైర్యం పెంచుకుని ఏం చేస్తే ప్రజల రుణం తీర్చుకుంటానో ఆలోచిస్తా. 53 రోజులు నన్ను జైల్లో పెడితే 80 దేశాల్లో తెలుగువారు నా కోసం పోరాటాలు చేయడం జీవితంలో మరచిపోలేను.

నాకు అధికారం…సీఎం పదవి కొత్తకాదు
‘నాలుగోసారి మళ్లీ సీఎం అయ్యాను. అవినీతి, కులం, మతం, వర్గం, డబ్బులతో ప్రభావితమయ్యే ఈ రోజుల్లో నాపై నమ్మకం పెట్టుకుని ప్రజలు గెలిపించారు. అధికారం నాకు కొత్త కాదు…సీఎం కుర్చీ కొత్తకాదు. దేశ రాజకీయాలు నాకు కొత్తకాదు. గత ఐదేళ్ల విధ్వంస పాలనతో ఎప్పుడూ లేని పరిస్థితులు చూస్తున్నాను. కానీ మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించి తీర్పునిచ్చారు. విధ్వంసమైన వ్యవస్థ, గాడి తప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వ అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు మా ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో రాష్ట్రాన్ని బాగు చేయగలనన్న నమ్మకం మీకుందా అని అడిగారు. నేను భయపడను…ప్రజల కోసం పని చేస్తానని చెప్పా. ఇటువంటి కీలక సమయంలో 21 మంది ఎన్డీయే ఎంపీలు రాష్ట్రంలో గెలిచారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడేందుకు మన ఎంపీల సంఖ్య ఉపయోగపడింది. రాష్ట్రం కోసం ఇటుకాఇటుకా పేర్చుతున్నాం. రాత్రికిరాత్రే అద్భుతాలు జరగవు.

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం

కూటమి పాలన ప్రారంభమై 162 రోజులు అయింది. గాడి తప్పిన వ్యవస్థలను గాడిన పెట్టాం. అప్పులు లేవని బయట ఇష్టానుసారంగా ప్రచారం చేశారు…సాక్ష్యాలతో రూ.10 లక్షల కోట్ల అప్పులున్నాయని చూపించాం. సంతృప్తి, సంతోషం, భద్రత కల్పించే విధానాలు తీసుకొచ్చాం. 2014లో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో పాలన ప్రారంభించినా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఎస్సీ, ఎస్టీలకు 27 సంక్షేమ పథకాలు, ముస్లింలకు 10 పథకాలతో పాటు బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందుకెళ్లాం. 127 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. ఎన్టీఆర్ బేబీ కిట్, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ తో పాటు, మహాప్రస్థానం అంబులెన్సులను ప్రవేశపెట్టాం. గెలిచిన వెంటనే పింఛను రూ.4 వేలకు పెంచాం. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేలు, అనారోగ్యంతో బాధపడేవారికి రూ.10 వేలు, రూ.15 వేలు అందిస్తున్నాం. సంపన్న రాష్ట్రాలు కూడా ఇంతలా పెన్షన్లు ఇవ్వడం లేదు. పేదల కోసం ఇప్పటికే 198 చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. పేదలకు, ఆకలేసేవారికి కనీసం తిండిపెట్టడం మన బాధ్యత. ఇప్పటికి 1.18 కోట్ల మంది అన్నక్యాంటీన్లలో భోజనం చేశారు. అన్ని దానాల కంటే అన్నదానం పవిత్రమైంది.

రేషన్, ఆధార్ కార్డు ఉంటే దీపం పథకానికి అర్హులే
ఆడబిడ్డలకు దీపం పథకం కింద సమైక్య రాష్ట్రంలో ఉచిత గ్యాస్ అందించాం. నా తల్లి పడ్డ కష్టాలు చూసిన వ్యక్తిగా గ్యాస్ పథకం పెట్టాను. ఆడబిడ్డలు తెచ్చుకున్న కట్టెలు వర్షాకాలంలో తడిచి మండక వారు పడే కష్టం అంతాఇంతా కాదు. నాడు వాజ్ పేయ్ ను ఒప్పంచి వంటగ్యాస్ అందించాం. ఇప్పుడు దీపం-2 పథకాన్ని అమలు చేశాం. యేడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. పథకం విధానాలు తెలియక కొందరు నచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇవ్వడానికి ఇది క్యాష్ కాదు…గ్యాస్. పథకం ప్రారంభించాక ఇప్పటి వరకు 42.40 లక్షల మంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఎవరికున్నా అర్హులే అవుతారు. సిలిండర్ బుక్ చేసుకన్న 48 గంటల్లోనే డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి.

మత్య్సకారుల పొట్టగొట్టే జీవో రద్దు చేశాం
చెత్తపై పన్ను వేసినా తొలగించకుండా 83 లక్షల మెట్రిక్ టన్నులు పేరబెట్టారు. వీళ్లు వేసిపోయిన చెత్తను క్లీన్ చేసే బాధ్యత మేము తీసుకున్నాం. 217 జీవో తెచ్చి మత్స్యకారులు పొట్టగొట్టారు. ఆ జీవోను రద్దు చేసి మత్య్సకారులకు అండగా ఉన్నాం. స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. చేతి, కుల వృత్తుల వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. అర్చకుల జీతాలను రూ.10 వేల నుండి రూ.15 వేలకు పెంచాం. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల వేతనాలు రూ.15 వేల నుండి రూ.25 వేలకు పెంచాం. ధూపదీపనైవేద్యాలకు రూ.10 వేలకు పెంచాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తేశాం.

వాట్సాప్ లో మెసేజ్ పెట్టగానే ధాన్యం కొనుగోలు

వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టాం. వాట్సాప్ లో ఒక్క మెసేజ్ పెడితే రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందిస్తాం. పేదలకు సంక్షేమాన్ని అమలు చేయడంతో పాటు అభివృద్ధి చేయడం మా ప్రభుత్వం విధానం. అభివృద్ధి చేసి ఆదాయం పెంచి పేదలకు పథకాలు అమలు చేస్తాం. అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు గ్రాంటు ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. డిసెంబర్ నుండి రాజధాని పనులు ప్రారంభం అవుతాయి. పోలవరంనకు రూ.12,127 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం 45.72 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది.

ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు
కేంద్రం ఇచ్చిన నిధులను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించింది. రూ.4,500 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి సెంట్రల్లీ స్పాన్సర్ పథకాలకు నిధులు తెచ్చాం. జల్ జీవన్ మిషన్ పథకం కింద కుళాయి ద్వారా మంచినీళ్లు అందిస్తాం. పంచాయతీలకు రూ.990 కోట్లు విడుదల చేశాం. నరేగాలో ఎక్కడ పని చేశారో గత ఐదేళ్లు చూళ్లేదు. ఆడిట్ చేయలేదు..మంచి పథకాన్ని భ్రష్టు పట్టించారు. నరేగా నిధులు ఉపయోగించుకుని గతంలో 25 వేల కి.మీ సీసీ రోడ్లు వేశాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు పెట్టి రూ.4,500 కోట్లతో 30 వేల పనులకు ఆమోదం తెలిపాం. రాష్ట్రంలో ఏ రోడ్లు చూసినా భయంగా ఉంది. రోడ్లు మన నాగరికతకు చిహ్నం. గ్రామాల్లో రైతులు పండించే పంటలు మార్కెట్ కు తీసుకెళ్లాలన్నా రోడ్లు కావాలి. ఉన్న రోడ్లను చూసి గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు విరక్తి కలిగింది. అందుకే గుంతలు పూడ్చేందుకు రూ.860 కోట్లు కేటాయించి పనులు చేపట్టాం. రూ.75 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి…మరో రూ.30 వేల కోట్ల పనులు కూడా రానున్నాయి. రూ.72 వేల కోట్ల విలువైన రైల్వే పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయి.

ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేవారికి మరింత ప్రోత్సాహకాలు
మా హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మరమ్మతులు చేయించడం…తర్వాత వచ్చిన ప్రభుత్వాలు భ్రష్టు పట్టించడం జరుగుతోంది. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయించకపోవడంతో 4 లక్షల ఎకరాలకు నీరు అందలేదు. వీటిని కూడా సరిదిద్దుతున్నాం. జాబ్ ఫస్ట్ విధానంతో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. త్వరలోనే రాతపరీక్షలు పూర్తి చేసి నియామకాలు చేపడతాం. 25 కొత్త పాలసీలు తెచ్చాం. టూరిజం పాలసీని కూడా తెస్తాం. రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ల ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఈ రంగంలో రూ.3.75 లక్షల కోట్లతో 3,73,539 మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తాం.

ఆడబిడ్డల జోలికొచ్చే వారికి ఏం చేయాలో చేసి చూపిస్తా
శాంతిభద్రతలను గతంలో గాలికొదిలేశారు. పోలీసులను ప్రతిపక్ష నేతలను అణగదొక్కడానికి ఉపయోగించుకున్నారు. గంజాయి, డ్రగ్స్ ప్రవేశపెట్టి యువత జీవితాలు నాశనం చేశారు. వార్నింగ్ ఇస్తున్నా…ఆడబిడ్డల జోలికి వచ్చేవారికి ఏం చేయాలో చేసి చూపిస్తాం. ఈనెలలోనే డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీ చేపడతాం. విద్యార్థుల్లో కూడా చైతన్యం తెస్తాం. ఎవరైనా సమాజానికి సవాల్ గా మారితే తాటతీస్తా. ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు గతంలో పోలీస్ శాఖకు నిధులు ఇవ్వలేదు. పోలీస్ శాఖను బలోపేతం చేసి శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇస్తాం. సుపరిపాలనకు నాంది పలికాం. అభివృద్ధి, సంక్షేమం సజావుగా ఉండాలంటే గుడ్ గవర్నెన్స్ ఉండాలి.

యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టుతో భూముల జోలికి రాకుండా చేస్తాం
భూముల దోపిడీ కోసం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం…యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తాం. భూముల జోలికి ఎవరూ రాకుండా చేస్తాం. సమగ్ర సర్వే అని పొలాల సరిహద్దులు మార్చేశారు. మద్యంలోనూ దోపిడీ చేశారు. రకరకాల పేర్లతో ఇష్టమొచ్చిన బ్రాండ్లు తెచ్చారు. అందుకే మద్యం విధానంలో పారదర్శకత తెచ్చాం. లాటరీ విధానంలో షాపులు కేటాయించాం. బెల్టు షాపులు తెరిస్తే బెల్టు తీస్తాం…షాపు లైసెన్సులు రద్దు చేస్తాం. నియోజకవర్గంలో బెల్టు షాపులు లేకుండా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి. సీనరేజ్, జీఎస్టీ లేకుండా ఉచిత ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వం దాచిన అన్ని జీవోలు ఆన్ లైన్ లో పెట్టాం.

వాట్సాప్ ద్వారా 150 సేవలు అందుబాటులోకి

టెక్నాలజీ అందిపుచ్చుకుని వాట్సాప్ గవర్నెన్స్ విధానం తీసుకురాబోతున్నాం. తద్వారా అన్ని సేవలు వాట్సాప్ ద్వారా అందిస్తాం. దేవాదాయ శాఖలో 56, ఎనర్జీలో 39, ఆర్టీసీలో 9, ఆర్టీఏలో 4, గ్రీవెన్స్ లో 6, రెవెన్యూలో 16, మున్సిపల్ శాఖలో 28 సర్వీసులతో దాదాపు 150 సర్వీసులను వాట్సాప్ ద్వారా అందిస్తాం. స్థానికత, బర్త్, డెత్, ఆదాయం, అడంగల్, స్టడీ సర్టిఫికేట్ల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగి అవస్థలు పడుతున్నారు… వాటిని ఆన్ లైన్ ద్వారా పరిష్కరించి అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చేస్తాం.

క్షేత్రస్థాయిలో ప్రజలతో ముఖాముఖి
ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి మ్యానుఫ్యాక్చరింగ్, శిక్షణ అందించి దేశానికే ఆదర్శంగా నిలుపుతాం. ఇప్పటికే డ్రోన్ పాలసీని కూడా ప్రవేశపెట్టాం. రైతులకు గిట్టబాటు ధర వస్తుందా లేదా అన్నదానిపై నిత్యం సమీక్ష చేయాలి. కొందరు పత్తి వ్యాపారులు చిన్న కారణాలు చూపి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది…రైతులకు అన్యాయం జరగకుండా చేస్తాం. నిత్యవసర వస్తువుల ధరలు పెరగకుండా కమిటీ వేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్ కూడా రూపకల్పన చేస్తున్నాం. త్వరలోనే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చేపడతాం.

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి దశదిశ
విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయింది…గత పాలకుల నిర్వాకంతో బ్రాండ్ పోయింది….సమస్యలు కూడా వచ్చి పడ్డాయి. ఆర్ధిక వ్యవస్థ, అధికార యంత్రాంగం నిర్వీర్యం అయ్యాయి. కానీ ధృడ సంకల్పంతో రాజీపడకుండా ముందుకెళ్తూ రాష్ట్రానికి దశదిశ చూపించే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం రోజున రాష్ట్రంలో పెద్దఎత్తున నివాళులర్పిస్తాం. ఎంతోమంది అన్నార్థుల ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ పేరును మధ్యాహ్న భోజన పథకానికి పెట్టాం. సోషల్ మీడియా సైకోలను, గంజాయి ముఠాను అరికట్టడంలో రాజీపడం. ఏ ఆడబిడ్డను అవమానపరిచినా వారికి అదే చివరి రోజు.’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Check Also

గొప్ప మనసు చాటుకున్న మంత్రి దుర్గేష్ అంటూ ఆనందం వ్యక్తం చేసిన బాధిత కుటుంబం

-మంత్రి కందుల దుర్గేష్ అందించిన ఆర్థిక సాయం వెలకట్టలేనిదంటూ పేర్కొన్న బాధిత కుటుంబం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *