-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలకు రాకుండా డుమ్మా కొట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్దాలను అందంగా వల్లి వేయడంలో జగన్ రెడ్డి ఆరితేరారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. విద్యుత్ రంగం గురించి జగన్ రెడ్డి మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల రక్తం తాగిన జగన్ మోహన్ రెడ్డికి ట్రూప్ అప్ చార్జీల గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.
రూ. 18 వేల కోట్ల భారాన్ని చంద్రబాబు నాయుడు ప్రజల మీద మోపారని జగన్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పిన మంత్రి గొట్టిపాటి, ప్రజలపై భారం మోపాలని రూ. 20 వేల కోట్ల ట్రూప్ అప్ చార్జీల ప్రతిపాదనను ఏపీఈఆర్సీకి పంపిన ప్రజా ద్రోహి జగన్ మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులు చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారి పీడిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి.. ఆయనపై విమర్శలా? అని మండిపడ్డారు. ఐదేళ్ల కాలంలో ప్రెస్ మీట్లు అన్నీ ప్యాలెస్ లో పెట్టి కాలం వెళ్లదీసిన జగన్ రెడ్డికి ఏపీ ప్రజలు ప్యాలెస్ కే పరిమితం అయ్యేలా తీర్పు ఇచ్చారని చెప్పారు. ఇకనైనా ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా పోరాడాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు.