నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి వచ్చిందంటే ఎవరైనా చల్లని ఏసీ గాలులతో సేద దీరాలనుకుంటారు. కాని ఈ ఏడాది ఏసీలు కొనుగోలుదారులకు వేడి పెంచనున్నాయి. ఏసీల విక్రయానికి పలు కంపెనీలు సన్నాహాలు చేసుకుంటూనే వాటి తయారీలో ఉపయోగించే వస్తువుల ధరలు పెరగడం వల్ల ఈ ఏడాది ఏసీల ధర 5-8 శాతం మధ్యన పెంచే ప్రయత్నంలో ఉన్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ధరలు పెంచినా ఈ ఏడాది ఏసీల విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసం కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తత మహమ్మారి నేపథ్యంలో సమాజంలో పెరిగిన ఆరోగ్యం, పారిశుధ్య చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో ఏసీలు విడుదల చేశాయి. అలాగే అమ్మకాలు పెంచుకునేందుకు ఎప్పటివలెనే నో కాస్ట్, ఈఎంఐ, క్యాష్ బ్యాక్ వంటి ఎన్నో ప్రోత్సాహకాలు కూడా సిద్ధం చేశాయి. ఎల్జీ, వోల్టాస్ కంపెనీలు ఇప్పటికే సూక్ష్మక్రిముల నుంచి రక్షణ కల్పించే యూవీ ఎల్ఈడీ సిస్టమ్తో కూడిన ఏసీలు విడుదల చేశాయి. అలాగే పానాసోనిక్ కంపెనీ కరోనా వంటి ప్రమాదకరమైన వైర్సల నుంచి 99.99 శాతం రక్షణ కల్పించే నానో ఎక్స్ టెక్నాలజీతో కూడిన ఏసీలు విడుదల చేసింది.