మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశం ఈనెల 25వ తేదీ శనివారం ఉ.10 గం.లకు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జరుగుతుందని జిల్లా పరిషత్ సిఇఓ పిఎస్.సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్ ఎన్నిక జరుగుతుందని ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్ మరియు జడ్ పి ప్రత్యేక అధికారి జె.నివాస్ ప్రిసైడింగ్ అధికారిగా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి ఈ ఎన్నికకు పరిశీలకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. కో-ఆప్టెడ్ సభ్యుల పదవులకు ఉదయం 10 గంటల లోగా నామినేషన్లు స్వీకరణ, ఉ. 10 గంటల తరువాత మ. 12 గంటల లోపు నామినేషన్ల స్కూృట్ని, మధ్యాహ్నం 12 గంటలకు సక్రమంగా ఉన్న నామినేషన్ల ప్రకటన, మ. 1 గంట లోపు నామినేషన్ల ఉపసంహరణ, మ. 1 గంటకు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరుగుతుందని తదుపరి ఫలితాలు వెల్లడిస్తారని తెలిపారు.
మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా ప్రజాపరిషత్ చైర్ పర్సన్ మరియు వైస్ చైర్ పర్సన్స్ రెండు పదవులకు ఎన్నిక జరుగుతుందన్నారు. జిల్లాలో ఎన్నికైన జడ్ పిటిసి సభ్యులు అందరూ విధిగా ఎన్నికల ధృవీకరణ పత్రం (ఫారం-29) ప్రత్యేక సమావేశానికి తీసుకురావలసిందిగా జడ్ పి సిఇవో సూచించారు. ప్రత్యేక సమావేశం సందర్భంగా స్థానిక మార్కెట్ యార్డులో వాహనాల కొరకు పార్కింగ్ ఏర్పాటు చేయబడిందని తెలిపారు.
Tags machilipatnam