Breaking News

సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తోంది … : కేశినేని నాని


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి పన్ను విధానంతో పూరి గుడిసె ఉన్నవారు కూడా ఆస్తి పన్ను కట్టలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో ఆదివారం 19వ డివిజన్‌ టీడీపీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు పెంచుతోందని కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనే చెప్పామని, ప్రజలు తమ మాట వినలేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని ప్రభుత్వం వేస్తోందని ఆయన ఆరోపించారు. కోవిడ్ కారణంగా ప్రజలు ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడుతున్నా జగన్మోహన్ రెడ్డి  ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచుతామని చెబుతున్నారు. ములుగేనక్కపై తాటిపండు పడే చందంగా ప్రజలపరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబితే బాగుండేదన్నారు. విజయవాడ నగరానికి గత 5సం.లలో వేలకోట్లరూపాయలు వెచ్చించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలకు మేము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. రెండు రాష్ట్రాల్లో జలవివాదంపై జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి డ్రామాలు ఆడుతున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ మధ్య సాన్నిహిత్యం ఉందని, ఆ ఇద్దరూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, జగన్, షర్మిల ముగ్గురూ ముగ్గురేనని, వ్యాపారాల కోసం నాటకాలు ఆడుతున్నారని కేశినేని నాని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా కోసం పోరాడతామని చెప్పినజగన్మోహన్ రెడ్డి పేపర్ ప్రకటనలకు పరిమితం అవుతున్నారన్నారు.

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ వైకాపా పాలించిన రెండు సంవత్సరాల్లో ఏం ఖర్చులు పెట్టారో చెప్పలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉందని, ఈ రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం ఏవైపుకు తీసుకువెళుతుందో అర్థంకావడం లేదన్నారు. ఈ విధానాల వల్ల కలిగే దుష్పలితాలకు రానున్న కాలంలో రాష్ట్రంలోని యువత ఉపాధి లేక అనుభవించాల్సి వస్తుందన్నారు . ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని గద్దె రామ్మోహన్‌ తెలిపారు.

నూతనంగా డివిజన్ కమిటీకి ఎన్నికైన భాగం సాయిప్రసాద్ మరియు కమిటీ సభ్యులను కేశినేని నాని. గద్దె రామ్మోహన్‌ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మారెడ్డి పట్టాభి, కాట్రగడ్డ బాబు, ఎస్.ఫిరోజ్, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, చెన్నుపాటి గాంధీ, పేరేపి ఈశ్వర్ పలువురు డివిజన్, అర్బన్ నాయకులు పాల్గొన్నారు.

Check Also

ఒంటి చేత్తో పది పనులు చక్కబెట్టే శక్తి ఒక్క మహిళలకే సాధ్యం

-మహిళలు డబ్బు కోసం దేహీ అనకూడదు -ఆడవాళ్లు ఎందులోనూ మగవారితో తీసిపోరు -స్త్రీలకు అవకాశాలు ఇవ్వాలేకానీ అద్భుతాలు సృష్టిస్తారు -మహిళల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *