బల్లికురువ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బల్లికురువ మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం అద్దంకి నియోజకవర్గం లోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ క్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అద్దంకి నియోజకవర్గంలోని సుమారు 33 మందికి రూ. 28 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 22 మందికి రూ. 83 లక్షలకు పైగా ఎల్ఓసీలు అందజేసినట్లు తెలిపారు. నేడు 57 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 71 లక్షలకు పైగా చెక్కులు అందజేయగా… మరో 11 మందికి రూ. 30 లక్షల మేరకు ఎల్ఓసీలు అందజేసినట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అద్దంకి ప్రజలకు ఆర్థిక సాయంగా రూ. 2 కోట్లకు పైగా చెక్కులు ఇచ్చినట్లు మంత్రి రవి కుమార్ పేర్కొన్నారు. దీని ద్వారా 123 మంది లబ్ది పొందినట్లు స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నా… పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని సర్వ నాశనం చేసిందని మంత్రి విమర్శించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను అనారోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. నాడు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను విడుదల చేయడం పూర్తిగా ఆపేశారని మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం పేదవాని ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చంద్రబాబు నాయుడు ఎంతో మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కేవలం మంచి ప్రభుత్వం మాత్రమే కాదు మనసున్న ప్రభుత్వం అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పుకొచ్చారు.