-2024-25 ఆర్థిక సంవత్సరానికి బీసీల సంక్షేమానికి 39 వేల కోట్లను కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని
-ఇది మంచి ప్రభుత్వం – బిసిల ప్రభుత్వం ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం
-:ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్. సవిత
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే అని, కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన జ్యోతిబా ఫూలే అడుగు జాడల్లో నడుస్తున్నదని ఇది మంచి ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్. సవిత పేర్కొన్నారు.
గురువారం ఉదయం తిరుపతి పట్టణంలోని స్థానిక గ్రాండ్ రిడ్జ్ మీటింగ్ హాల్ నందు మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే ఒక గొప్ప వ్యక్తి అని, సమాజంలో బడుగు బలహీన వర్గాలవారందరూ విద్యావంతులు కావలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే ఆయన పోరాటం చేసారని, ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలని, అన్ని రంగాలలోని మహిళలు ముందుండాలని ఆ కాలంలో మహిళలు చదువుకోకూడదని ఇబ్బందులు పెట్టిన సమయంలో మొదటగా తనభార్య సావిత్రిపూలే కి విద్య నేర్పించి ఆమె ద్వారా ఎంతో మందికి విద్యా దానం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే ఆయన యొక్క స్ఫూర్తి అని తెలిపారు. జ్యోతిరావు పూలే గారు బిసిల కోసం ఏ విధంగా పోరాటం చేసారో అదే స్పూర్తితో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు బడుగు బలహీన వర్గాల వారందరికీ రాజకీయంగా, విద్యా పరంగా అన్ని రంగాలలోను బి.సి లు ముందుండేలా వారు కృషి చేశారన్నారు. అదే స్ఫూర్తి తో ఈ రోజు విజినరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014 లో రాష్ట్రం విడిపోయి, అప్పుల్లో ఉన్నా కూడా బిసిల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం మనది అన్నారు. బీసీ, బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా విద్య ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో జ్యోతిరావు పూలే స్కూల్స్ ని ప్రారంబించామని అన్నారు. రాష్ట్రం మొత్తం 106 స్కూల్స్ ఉంటే అన్నిగతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో వచ్చినవే అన్నారు. బిసి సంక్షేమ హాస్టల్స్ లో అన్ని మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బీసీల సంక్షేమానికి 39 వేల కోట్లను కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. అసంపూర్తిగా ఉన్న 70 శాతం నుండి 80 శాతం పనులు పూర్తయిన బీసీ వసతి గృహాలు, రెసిడెన్షియల్ హాస్టళ్లను గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు త్వరలో పూర్తి చేయనున్నామని తెలిపారు. బీసీలకు ఆర్థికంగా చేయూతనందిస్తూ వారికి స్వయం ఉపాధి కల్పించడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి పలు చర్యలు చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకాలలో మెగా డీఎస్సీ మేరకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బడుగు బలహీనవర్గాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రారంభించామని త్వరలో ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. బి సి భవన్ లు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, బిసిల ప్రభుత్వం ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ మరియు సాధికార అధికారి చంద్రశేఖర్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.