-విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, పద్మ భూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత నార్ల వెంకటేశ్వరరావు పేరిట ఇకపై ప్రతి సంవత్సరం ఉత్తమ పాత్రికేయ అవార్డులను అందించనున్నట్లు పద్మ భూషణ్, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. లోక్ నాయక్ ఫౌండేషన్ నేతృత్వంలో ప్రతి సంవత్సరం ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికీ రూ.50వేల నగదు పురస్కారంతో విజయవాడ వేదికగా నార్ల ఉత్తమ పాత్రికేయ అవార్డులను అందిస్తామన్నారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తామని, ఇందుకోసం లబ్దప్రతిష్టులతో కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవార్డుల ప్రధానం ప్రతి సంవత్సరం డిసెంబరు 1 వతేదీన క్రమం తప్పకుండా జరుగుతుందని అచార్య యార్లగడ్డ స్పష్టం చేసారు. లోక్ నాయక్ పౌండేషన్ గత 21వ సంవత్సరాలుగా విశాఖ వేదికగా ఉత్తమ సాహితీ వేత్తలకు రూ.2 లక్షల పురస్కారం, ముగ్గురు సామాజిక సేవకులకు జీవన సాఫల్య పురస్కారాలుగా ఒక్కొక్కరికి లక్ష వంతున రూ.3 లక్షలు, మొత్తంగా రూ.5 లక్షల నగదు బహుమతిని అందచేస్తూ వస్తుందన్నారు. తాజాగా పాత్రికేయిలకు కూడా పురస్కారాలు అందించాలని నిర్ణయించామన్నారు. పత్రికా సంపాదకీయలను ఒక ఉద్యమంగా, సామాజిక సంస్కరణలకు స్పూర్తిగా ఉపయోగించిన నార్ల, పత్రికా సమాజానికి దిక్సూచి వంటి వారని ఆయన పేరిట అవార్డులు ఇవ్వటం తమ సంస్ధకు గౌరవంగా భావిస్తున్నామని లోక్ నాయక్ పౌండేషన్ వ్యవస్ధాపకులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ పేర్కొన్నారు.