తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సూళ్లూరుపేట లో పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ ముగించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్ పెంగల్ తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాల వలన నీట మునిగిన పంట పొలాలను గోకుల కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ సమీపంలో ఆర్డీవో మరియు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పడమటి కండ్రిగ రహదారిపై ప్రవహిస్తున నీటి ప్రవాహాన్ని, నీట మునిగిన వరి పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంఛార్జి సహాయ సంచాలకులు వ్యవసాయ శాఖ కవిత వివరిస్తూ పడమటి కండ్రిగ రహదారి నీటిలో సుమారు 150 ఎకరాలకు పైగా వరి పైరు నీట మునిగిందని తెలిపారు. వరదయ్యపాలెం కు చెందిన రాళ్ల కాలువ మరియు కాలంగి వరద నీటి ప్రవాహం సూళ్లూరుపేట పట్టణంలోని రైల్వే ట్రాక్ వద్ద కలిసే నేపథ్యంలో వరద నీరు వెనుకకు ఒత్తిడి వలన పడమటి కండ్రిగ రహదారి ప్రాంతాలపై నీటి ప్రవాహం వస్తుందని ఎస్ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ మదన గోపాల్ కలెక్టర్ గారికి వివరించారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సదరు వై-పాయింట్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
మీడియా తో కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో గత అయిదారు రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల తడ, వరదయ్యపాలెం, సూళ్ళూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదయిందని, జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షపాతం వల్ల రోడ్లు తెగి పోయినవి, చెరువులు కట్టలు తెగిన వాటికి, పంట నీట మునిగిన నష్టాలను తదితరాల వాటి ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోందని వాటిని పరిశీలించి జాబితా తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుందని అన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు యుద్ద ప్రాతిపదికన పునరుద్దరించడం జరిగుతుందని, చెరువులు బ్రీచ్ లకు మరమ్మత్తులు చేయడం జరుగుతుందని తెలిపారు. పంట నష్టం జరిగిన వాటి జాబితా తయారు చేసి నష్టపరిహారం ఇవ్వడం కొరకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని అన్నారు. తుఫాన్ వల్ల ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి త్వరితగతిన సాధారణ స్థాయికి తీసుకురావడము జరుగుతుందని తెలిపారు.
అనంతరం సత్యవేడు నియోజక వర్గంలోని వరదయ్య పాలెం మండలంలోని సంతవేలూరు చెరువు నిండి కలుజు పారుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. సదరు చెరువుకు ఒక భాగంలో బలహీనంగా ఉన్న కట్ట వద్ద ఇసుక బస్తాలతో అడ్డు కట్ట వేసి అవసరమైతే కరకట్టను బలోపేతం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అనంతరం జోరు వర్షంలోనూ శ్రీకాళహస్తి పట్టణం సమీపంలోని స్వర్ణముఖి నది ఆనకట్ట వద్ద వరద నీటి ప్రవాహాన్ని ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లు కిరణ్మయి, భాను ప్రకాష్ రెడ్డి, ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారులు తదితతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News