-యజ్ఞంలాంటి కార్యక్రమం శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టండి..
-లబ్దిదారులకు అన్నివిధాల సహకరించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాం..
-జగనన్న ఇళ్ల నిర్మాణానికి 20 శాతం తగ్గింపుతో మెటల్ సరఫరా చేయాలి..
-రాష్ట్ర మంత్రులు పి.రామచంద్రారెడ్డి, సిహెచ్. శ్రీరంగనాధరాజు, పేర్ని వెంకట్రామయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జగనన్న ఇళ్లకాలనీలనిర్మాణంకోసం లక్షా 10 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని గృహనిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు చెప్పారు. జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలుపై గురువారం జయవాడ జలవనరులశాఖ ఆవరణలో గల రైతుశిక్షణా కేంద్రంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టరు జె.నివాన్లతో కలిసి ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో రాష్ట్ర గృహనిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి రాష్ట్రంలో 17 వేలకు పైగా జగనన్న ఇళ్లకాలనీలను నిర్మిస్తున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో 13 వేల గ్రామపంచాయతీలు ఉండగా, క్రొత్తగా 17 వేల 500 గ్రామాలు రాబోతున్నాయన్నారు. జగనన్న కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామని, విద్యుత్తు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్ తో పాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఇళ్లస్థలాలకోసమై 30 వేల ఎకరాలను సేకరించి ఇవ్వడం జరిగిందన్నారు. జగనన్న కాలనీల నిర్మాణంలో స్థానిక శాసనసభ్యుల సహకారం ఎంతో అవసరం అన్నారు. 30 లక్షలమంది లబ్ధిదారులకు సంబంధించిన అతి పెద్ద కార్యక్రమం అమలుకు అదే స్థాయిలో పర్యవేక్షణ ఉన్నప్పుడే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతామన్నారు. గృహనిర్మాణాలకు సంబంధించి లబ్దిదారులతో గ్రూపులు ఏర్పాటు చేసి ఇసుక, సిమెంటు, ఐరన్ వంటివి ఒకే మొత్తంలో కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లయితే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉంటుందన్నారు. గృహనిర్మాణాలలో తాపీమేస్త్రీల కొరత ఉన్నచోట ఇతర జిల్లాలు రాష్ట్రాల నుండి తాపీ పనివారలను రప్పించినట్లయితే తక్కువధరకు నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం ఉంటుందని ఇందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వీలున్నచోట్ల బ్రిక్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి తక్కువధరకు ఇటుకలు సరఫరా చేసే ఆలోచన చేయాలని మంత్రి తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు గృహనిర్మాణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించి లబ్దిదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ఇంత పెద్ద ఎత్తున పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం పూర్వజన్మ సుకృతంగా అధికారులు భావించాలన్నారు. భగవంతుడు ఇచ్చిన ఇటువంటి మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుని పేదల ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు బాగా పనిచేయాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకల తయారీ యూనిట్లను ప్రారంభించి లబ్దిదారులకు కనీసధరకు సరఫరా అయ్యేలా చూస్తామన్నారు. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన కిటికీలు, ద్వారాబంధాలు, తదితర సామాగ్రిని సచివాలయాల దగ్గర పెట్టి అమ్మడం జరుగుతుందని, దానికన్నా తక్కువుధ రకు బయట దొరికితే కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం పేదలకు 1 నుంచి 8 లక్షల రూపాయల విలువైన స్థలం ఇవ్వడంతోపాటు ఇళ్ల నిర్మాణానికి ప్రత్యక్షంగా రూ. 1.80 లక్షలు, పరోక్షంగా సహకరిస్తూ రూ. నాలుగైదు లక్షల వరకూ లబ్ధిదారునికి చేయూతను ఇస్తున్నామని చెప్పారు.
జిల్లా ఇన్ ఛార్జ్, పంచాయతిరాజ్ శాఖామంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి మానస పుత్రిక అయిన జగనన్న ఇళ్ల కాలనీల పధకం పై శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టి యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పేదలందరికీ ఇళ్లను నిర్మించాలనే సంకల్పంతో ప్రపంచంలోనే కాదు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మనరాష్ట్రంలో ముఖ్యమంత్రి 30 లక్షల గృహాలను నిర్మించాలనే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 2 లక్షలకు పైగా గృహాలను నిర్మించాలనే లక్ష్యం కాగా ఇందులో లక్షా 39 వేలకు పైగా గృహనిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. గృహాల మంజూరులో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాకు మంజూరు చేసిన గృహాలను పూర్తి చేసేందుకు శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న కాలనీల నిర్మాణాలలో చిన్న చిన్న సమస్యలను అధిగమించి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో గృహనిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు కొన్ని లేఅవుట్లు స్థలాల ఎ ంపికలో లోటుపాట్లు ఉన్నాయని, లేఅవుట్ భూమిధరకంటే ఆస్థలం మెరక చేసేందుకు ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి ఎదురైందన్నారు. అయినప్పటికీ లెవెలింగ్ కు అవసరమైన నిధులను పంచాయతిరాజ్ శాఖ నుండి మంజూరు చేస్తామని లెవెలింగ్ పనులు వెంటనే పూర్తి చేసి నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులకు రుణాలు మంజూరు చేసే విషయంలో అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బ్యాంకులు నుండి రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గృహనిర్మాణాలకు అవసరమైన కంకరను క్వారీ యజమానులు 20 శాతం తగ్గింపు ధరలకు అందజేయాలన్నారు. లబ్దిదారుల నుండి నిబంధనలకు మించి వసూలు చేస్తే ఆయా క్రషింగ్ ను నిలిపివేస్తామన్నారు. జగనన్నకాలనీల్లో తక్షణమే బోర్ లను ఏర్పాటు చేసి నిర్మాణాలకు నీటి సౌకర్యం కల్పించాలని, సిసి రోడ్లు, విద్యుత్తు, డ్రెయిన్లు, ఓవర్ హెడ్ టాంకులు నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలో జూలై 1, 3, 4 తేదీలలో నిర్వహించిన మెగా గ్రౌండింగ్ మేళాలో స్థానిక రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు ప్రోత్సాహంతో 1,00,039 ఇళ్లు గ్రౌండింగ్ విజయవంతంగా చేసామన్నారు. సెప్టెంబరు 15వ తేదీ నాటికి పునాది స్థాయికి తీసుకుని వచ్చేందుకు 8 వారాల ప్రణాళికను రూపొందించామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 1543 ఇళ్లు పునాది స్థాయి పూర్తి కాగా, వారం వారం ప్రణాళిక క్రింద ఇళ్లు పునాదిస్థాయి పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు చేసే పనిలో 50 శాతం పనులు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 30 శాతం ఉపాధిహామి పనులకు, 20 శాతం నాడు-నేడుకు కేటాయించాలని నిర్దేశించడం జరిగిందన్నారు. జిల్లాలో మొదటి విడతలో 1,67,541 ఇళ్లు నిర్మించాలని మంజూరు అయ్యాయన్నారు. వీటిలో డ్వా క్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 79 వేలమంది మహిళలకు అదనపు రుణసదుపాయం కల్పిస్తున్నామన్నారు.
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో చేపట్టడం జరిగిందని దీనిని ఛాలెంజ్ గా తీసుకుని లక్ష్యం పూర్తి చేయాలన్నారు. ప్రతీవారం పేమెంట్ జరిగేలా చూడాలన్నారు. శాండ్ కూపన్లు ఇచ్చిన తర్వాత త్వరితగతిన సరఫరా అయ్యేలా చూడాలన్నారు.
హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ దేశంలోనే కాక ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఎక్కడా జరగ లేదన్నారు. 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం గొప్ప విషయం అన్నారు. కృష్ణా జిల్లాపై అభిమానంతో 2 లక్షల 11 వేల ఇళ్లు ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. దీనితో వీటిని పూర్తి చేసే బాధ్యత మరింత పెరిగిందన్నారు.
విజయవాడ సెంట్రల్ ఎ మ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇళ్లస్థలాలు కలిగిన 5 వేలమందికి ఇళ్లు మంజూరు చేయాలన్నారు. గతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల మరమ్మత్తులకు ప్రత్యేక కేసుగా పరిగణించి నిధులు మంజూరు చేయాలన్నారు. నున్న, సూరంపల్లిలలో మంచి లేఅవుట్లు ఏర్పడ్డాయన్నారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో స్వంత ఇంటి స్థలాలు ఉన్న 1000 మందికి ఇళ్ల నిర్మాణానికి అనుమతిని ఇవ్వాలన్నారు.
పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ జియోటాగింగ్ విషయంలో ఎక్కువ గడువు తీసుకోకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో బిల్లులు చెల్లింపులకు ఎక్కువ సమయం పడుతుందన్నారు.
తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి మాట్లాడుతూ గతంలో 2200 ఇళ్లు ఆన్ లైన్ లో నిలిచిపోయాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి అందిస్తున్న అదనపు రుణాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచాలని కోరారు. స్వంత స్థలం ఉన్నవాళ్లకు ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇటుక తయారీ, క్రషర్ దార్లతో సమావేశం నిర్వహించామని, పేదల ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరకే వీటిని అందించడానికి వారు సుముఖత వ్యక్తం చేశారన్నారు. పేదల స్వంత ఇంటి కల సాకారం చేసే మంచి బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ యండి కరీమున్నీసా, విజయవాడ నగరమేయరు రాయన భాగ్యలక్ష్మి, మచిలీపట్నం మేయరు మోకా వెంకటేశ్వరమ్మ, హౌసింగ్ యండి నారాయణ్ భరత్ గుప్తా, జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) కె. మాధవిలత,
జాయింట్ కలెక్టరు హౌసింగ్ నుపూర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టరు జి.యస్.యస్. ప్రవీణ్ చంద్, ఆర్ డిఓలు ఖాజావలి, శ్రీనుకుమార్ , రాజ్యలక్ష్మి, హౌసింగ్ పిడి రామచంద్రన్, డిఆర్ డిఏ పిడి శ్రీనివాసరావు, మెప్మా పిడి జివి. సూర్యనారాయణ, యుసిడి పిడి అరుణ, తదితరులు పాల్గొన్నారు.