-తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐఎస్‌ఓ సర్టిఫికేట్లను సచివాలయ ఉద్యోగులకు ప్రధానం
– ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
– ఉద్యోగులకు సర్టిఫికేట్లను అందచేసిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న 98 గ్రామ, 16 వార్డు సచివాలయాలకు ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ 9001 గుర్తింపు లభించింది. ఈ మేరకు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐఎస్‌ఓ గుర్తింపును సాధించిన సచివాలయాల ఉద్యోగులకు సర్టిఫికేట్ల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర సమాచార, రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్యోగులకు ఐఎస్‌ఓ సర్టిఫికేట్లను అందచేశారు. ఈ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ ఆలోచనల నుంచి సచివాలయ వ్యవస్థ రూపకల్పన జరిగింది. ప్రజల ముంగిట్లోకే పాలనను తీసుకురావాలన్న గొప్ప సంకల్పం నుంచి ఈ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నేడు దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తోందంటే, దానికి క్షేత్రస్థాయిలో పాలనను తీసుకువెడుతున్న సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థే కారణం. అటువంటి మంచి వ్యవస్థలో పనిచేస్తున్న సచివాలయాలు తమ అత్యుత్తమ సేవలకు ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ సర్టిఫికేట్లను సాధించడం చాలా సంతోషం కలిగిస్తోంది. కృష్ణాజిల్లాలో ప్రారంభమైన ఈ గుర్తింపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సచివాలయాలు కూడా సాధించాలి. ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని సీఎం వైయస్ జగన్ బలంగా సంకల్పించారు. అందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా అత్యంత పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26 లక్షల మంది నిరుద్యోగులు ఈ పరీక్షలు రాశారు. ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా అత్యంత పకడ్భందీగా పరీక్షలను నిర్వహించాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఉద్యోగులు తమ ప్రతిభాపాటవాలతో ఉద్యోగాలను సాధించుకున్నారు.
బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు యువతను మోసం చేశాడు…
గత ప్రభుత్వంలో చంద్రబాబు ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందంటూ ఎన్నికల్లో ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకున్న తరువాత ఆయన అసలు నైజం బయటపడింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు రెండు లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాడు. కొత్త జాబులు రాకపోగా, ఉన్న ఉద్యోగాలను తొలగించిన ఘనత చంద్రబాబుది. తాను ప్రజలకు మేలు చేయకపోగా తిరిగి జూమ్ కాన్ఫెరెన్స్‌ల ద్వారా ఈ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ శ్రీ వైయస్ జగన్ ఏనాడు ఇటువంటి మోసపూరిత విధానాలకు పాల్పడలేదు. అధికారంలోకి రాగానే లక్షలాధి మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, యువతలో సేవాభావంను పెంపొందించేందుకు
వాలంటీర్లను నియమించారు.మీ పనితీరుతోనే ఈ ప్రభుత్వానికి మంచిపేరు…
సీఎం శ్రీ వైయస్ జగన్ పేదలకు ఇంటి ముందుకే ప్రభుత్వ పథకాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నేడు ఒక రూపాయి కూడా లంచం లేకుండా అన్ని పథకాలను అర్హులకు అందిస్తున్నాం. సచివాలయ, వాలంటీర్ల కృషి వల్ల జగన్ గారు అమలు చేసే కార్యక్రమాలు విజయవంతంగా ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఇటీవల జరిగిన తిరుపతి ఎన్నికల్లో ధనం, మద్యం ప్రభావం లేకుండా ప్రజల్లోకి వెళ్లి, మా పనితీరుకు ఓట్లు వేయాలని కోరాం. దాదాపు యాబై ఆరుశాతం ఓట్లు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా అధికారపార్టీకి వచ్చాయి. అంటే ప్రజలు ఈ ప్రభుత్వ పాలన పట్ల, మీరు అందిస్తున్న సేవల పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఐఎస్‌ఓ సర్టిఫికేట్లు సచివాలయాల ప్రతిష్టను మరింత పెంచాయి…
కృష్ణాజిల్లాలోని సచివాలయాలు ఐఎస్‌ఓ సర్టిఫికేట్లు సాధించి అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలు, సంస్థలు తమ పనితీరుకు నిదర్శంగా ఐఎస్‌ఓ సర్టిఫికేట్లను సాధిస్తూ ఉంటాయి. దానివల్ల వాటి ప్రతిష్ట పెరుగుతుంది. ఒక ప్రభుత్వ సంస్థగా సచివాలయాలు నిర్ధిష్ట కాలపరిమితిలో అత్యంత పారదర్శకంగా సేవలను అందిస్తూ, ఐఎస్‌ఓ గుర్తింపును సాధించడం సచివాలయాల ప్రతిష్టను మరింత పెంచినట్లయ్యింది. చిత్తశుద్ది, అంకితభావంతో సచివాలయ ఉద్యోగులు అందిస్తున్న సేవలు, పేదల కోసం ఎంతో మేలు చేయాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్ ఆశయాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇదే చిత్తశుద్దితో ప్రజలకు ప్రభుత్వ పథకాలను మరింత చేరువ చేయాలని కోరుకుంటున్నానని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు, నిర్ధేశిత సమయంలో ఉత్తమ సర్వీసులను అందించినందుకు ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ సర్టిఫికేట్ పొందినందుకు అందరికీ శుభాకాంక్షలు. కృష్ణాజిల్లాలో 1287 సచివాలయాల్లో 11,529 మంది ఉద్యోగులు వివిధ శాఖలకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ నాడీ వ్యవస్థలా 23,329 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మీరు అందరు నిర్వర్తిస్తున్న అసమానమైన సేవాతత్పరత, విధి నిర్వహణలో చూపుతున్న చిత్తశుద్ది వల్ల దేశంలోనే మీ సేవలకు ప్రత్యేక గుర్తింపు ఈ రాష్ట్రానికి వచ్చింది. ప్రజలకు సేవలు అందించడంలోనే కాదు, ప్రభుత్వ పథకాలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అవినీతి, లంచం లేకుండా ప్రజలకు చేరువ చేస్తున్న గొప్ప వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. ప్రతి ఏటా ఒక్క పైసా కూడా అవినీతి జరగకుండా రూ.60 వేల కోట్లను ప్రజలకు అందిస్తున్న మంచి వ్యవస్థలో మీరంతా పనిచేస్తున్నారు. ప్రజలకు మంచి పాలనను అందించాలనే సంకల్పంతో సీఎం శ్రీ వైయస్ జగన్ చేసిన ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చి, ఈ వ్యవస్థను వాస్తవరూపంలో విజయవంతం చేస్తున్న ఘనత ఉద్యోగులదే. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్, విఎస్ అండ్ జిఎస్) అజయ్ జైన్, ఎమ్మెల్సీ కరీమున్నీసా బేగం, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, చిత్తూరు శాసనసభ్యులు శ్రీనివాస్, కలెక్టర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు.