Breaking News

శ్రీ‌వారి భ‌క్తుల‌కు సుల‌భంగా, త్వ‌రిత గ‌తిన వ‌స‌తి : టిటిడి ఈవో

తిరుమ‌ల, నేటి పత్రిక ప్రజావార్త :

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు సుల‌భంగా, త్వ‌రిత గ‌తిన వ‌స‌తి సౌక‌ర్యం క‌ల్పించాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని త‌న ఛాంబ‌ర్‌లో గురువారం ఆయ‌న వ‌స‌తిపై నూత‌నంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఐటి విభాగం నూత‌నంగా రూపొందించిన అకామిడేష‌న్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ బాగుంద‌న్నారు. విఐపి సిఫార‌సు లెట‌ర్లు, శ్రీ‌వాణి ట్ర‌స్టు భ‌క్తుల‌కు కూడా సాఫ్ట్‌వేర్ ఉప‌యోగ‌ప‌డేలా చేయాల‌న్నారు. తిరుమ‌ల‌లో వ‌స‌తి కొర‌కు ఆన్‌లైన్‌లో గ‌దులు అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత గ‌దుల స్లిప్పుల‌ను తిరుప‌తిలోనే స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. ఇందుకోసం అలిపిరి టోల్‌గేట్‌, అలిపిరి, శ్రీ‌వారిమెట్టు న‌డ‌క‌మార్గాల్లో కౌంట‌ర్లు ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. అలిపిరి టోల్‌గేట్ నుండి తిరుమ‌ల‌కు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి స్లిప్పులు స్కాన్ చేసుకున్న 30 నిమిషాల్లో ఎస్ఎంఎస్ వ‌స్తుంద‌న్నారు. అలిపిరి న‌డ‌క‌మార్గంలో వెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీ‌వారిమెట్టు మార్గంలో న‌డిచి వెళ్లేవారికి గంట‌లో ఎస్ఎంఎస్ వ‌స్తుంద‌న్నారు. ఆన్‌లైన్‌లో గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ చేసుకున్న భ‌క్తుల‌కు వ‌చ్చే ఎస్ఎంఎస్‌లో వారికి కేటాయించిన ఉప విచార‌ణ కార్యాల‌యం వివ‌రాలుంటాయ‌ని చెప్పారు. భ‌క్తులు నేరుగా సంబంధిత ఉప విచార‌ణ కార్యాల‌యానికి వెళ్లి గ‌దులు పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు. అదేవిధంగా క‌రంట్ బుకింగ్‌లో అయితే భ‌క్తులు 6 ప్రాంతాల‌లోని 12 కౌంట‌ర్ల‌లో ఏదో ఒక రిజిస్ట్రేష‌న్ కౌంట‌ర్‌కు వెళ్లి గుర్తింపు కార్డు చూపి పేరు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. వీరికి గ‌ది కేటాయింపు ఉప విచార‌ణ కార్యాల‌యం వివ‌రాలు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయ‌ని చెప్పారు. భ‌క్తులు నేరుగా సంబంధిత ఉప విచార‌ణ కార్యాల‌యానికి వెళ్లి గ‌దులు పొంద‌వ‌చ్చ‌న్నారు. గదుల అందుబాటు ప్రకారం భ‌క్తుల‌కు కేటాయిస్తార‌న్నారు.

కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ అప్లికేష‌న్‌పై స‌మీక్ష :
గ‌దులు పొందే యాత్రికుల సౌక‌ర్యాల‌కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు/సూచ‌న‌లు వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ అప్లికేష‌న్ రూపొందించిన‌ట్లు తెలిపారు. ప్ర‌తి కాటేజిలో భ‌క్తులు సుల‌భంగా గుర్తించే మొబైల్ నంబ‌ర్ ఏర్పాటు చేయాల‌న్నారు. ఆ మొబైల్ నంబ‌ర్‌కు భ‌క్తులు పంపే ఫిర్యాదుల‌పై వెనువెంట‌నే స్పందించే విధంగా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. భ‌క్తులు ఇచ్చే ఫిర్యాదులు అటోమెటిక్‌గా రికార్డు అయ్యేలా రూపొందించాల‌న్నారు. రోజుకు, వారానికి, నెల‌కు ఎన్ని ఫిర్యాదులు, సూచ‌న‌లు వ‌స్తున్నాయి, వాటిపై త‌దుప‌రి చ‌ర్య‌లు ఎలా తీసుకోవాలి అనే విష‌యంపై స‌మీక్షించారు. భ‌క్తుల నుండి వ‌చ్చే ఫిర్యాదులు వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని వ‌స‌తి విభాగం అధికారుల‌ను ఆదేశించారు.

అనంత‌రం టిటిడి కాల్ సెంట‌ర్ ద్వారా వ‌స్తున్న ప‌లు ఫిర్యాదుల‌ను విభాగాల వారీగా స‌మీక్షించారు. అదేవిధంగా తిరుమ‌ల‌లో కాటేజిల మ‌ర‌మ్మ‌త్తులపై ఈవో స‌మీక్షిచారు. అంత‌కుముందు రిసెప్ష‌న్ అధికారులు నూత‌నంగా రూపొందించిన అకామిడేష‌న్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సాఫ్ట్ వేర్‌పై ఈవోకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ స‌మీక్షలో అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సిఇ నాగేశ్వ‌ర‌రావు, ఎఫ్ ఏ అండ్ సిఏవో  బాలాజి, డిఎఫ్‌వో  చంద్ర‌శేఖ‌ర్‌, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవోలు  లోక‌నాథం,  భాస్క‌ర్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *