-నగరంలో అవార్డుల ప్రధానోత్సవ వేదిక ఏర్పాట్ల పరిశీలన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ఈనెల 7వ తేదీన వై.యస్.ఆర్. జీవితసాఫల్య, వై.యస్.ఆర్. సాఫల్య పురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన 6 విభాగాల్లో అవార్డులు ప్రకటించడం జరిగింది. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్ తో పాటు అసామాన్య ప్రతిభ కనబరిచిన సామాన్యులకు కూడా ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. సంస్థలు, వ్యక్తులకు కలిపి 62 అవార్డులు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆగష్టు 13న వైయస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, వైయస్ఆర్ అచీవ్ మెంట్ అవార్డులను ప్రధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వైయస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు రూ. 10 లక్షలు నగదు, జ్ఞాపిక, వైయస్ఆర్ అచీవ్ మెంట్ అవార్డుకు రూ. 5 లక్షలు నగదు, జ్ఞాపికను అందించనున్నారు. 6 కేటగిరీల క్రింద మొత్తం 62 అవార్డులను ప్రధానం చేయనున్నారు. ఈనేపథ్యంలో నగరంలోని ఏ1ప్లస్ కన్వెన్షన్ హాలును మంగళవారం జిల్లా కలెక్టరు జె. నివాస్, వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ లు పరిశీలించారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించి వేదిక ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లుకు సంబంధించి ఏ1 ప్లస్ కన్వెన్షన్ హాలు ఏమేర అనువుగా ఉంటుందో వారు పరిశీలించారు. వేదిక నిర్మాణ ఏర్పాట్లుకు సంబంధించి పలు సూచనలను కలెక్టరు జె.నివాస్ చేసారు.