రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలను బెదిరిస్తూ, ఇబ్బందులకు గురిచేసే రౌడీలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. రప్పారప్పా అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే రౌడీల తాట తీయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని సహించకూడదని, నేరస్తులకు రాజకీయాలు రక్షణ కల్పించకూడదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇతరులను వేధించే వారిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల స్మారక పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. శాంతిభద్రతలు, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో అలజడి, అశాంతి ఉంటే పెట్టుబడిదారులు ముందుకు రారని పేర్కొన్నారు. నేరం జరిగిన తర్వాత ఛేదించడం పోలీసుల సమర్థతకు నిదర్శనమైతే, నేరం జరగకుండా నివారించడమే అత్యుత్తమ పోలీసింగ్‌కు గుర్తు అని చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
