ఈ నెల 18 నుంచి రెండో ద‌శ నామినేష‌న్లు..

– ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు దాఖ‌లుకు గ‌డువు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పంచాయ‌తీ ఎన్నిక‌ల రెండోద‌శకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల ప్ర‌క్రియ ఉంటుంద‌ని, ఈ నెల 21వ తేదీన నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌రుగుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ నెల 29వ తేదీన పోలింగ్ జ‌రుగుతుంద‌ని.. అదేరోజు కౌంటింగ్‌, ఫ‌లితాల వెల్ల‌డి ఉంటుంద‌న్నారు. ఇందుకు సంబంధించి ప‌టిష్ట ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. రెండో ద‌శ ఎన్నిక‌లు నందిగామ రెవెన్యూ డివిజ‌న్‌లోని ఏడు మండ‌లాల్లో 138 గ్రామ పంచాయ‌తీలు, 1,432 వార్డులకు 1,468 పోలింగ్ కేంద్రాల్లో జ‌ర‌గ‌నున్న‌ట్లు వివ‌రించారు. నందిగామ మండ‌లంలో 23 గ్రామపంచాయ‌తీల్లో 228 వార్డుల‌కు, చంద‌ర్ల‌పాడు మండ‌లంలో 18 పంచాయ‌తీల్లో 194 వార్డుల‌కు, జ‌గ్గ‌య్య‌పేట మండ‌లంలో 19 పంచాయ‌తీల్లో 212 వార్డుల‌కు, పెనుగంచిప్రోలు మండలంలో 15 పంచాయ‌తీల్లో 162 వార్డుల‌కు, వ‌త్స‌వాయి మండ‌లంలో 25 పంచాయ‌తీల్లో 246 వార్డుల‌కు, కంచిక‌చ‌ర్ల మండ‌లంలో 16 పంచాయ‌తీల్లో 178 వార్డుల‌కు, వీరుల‌పాడు మండ‌లంలో 22 పంచాయ‌తీల‌కు, 212 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎవ‌రైనా సందేహాల నివృత్తికి క‌మాండ్ కంట్రోల్ కేంద్రం నంబ‌రు (9154970454)లో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని తెలిపారు.