రెవెన్యూ సేవల పెండింగ్ దరఖాస్తులను వారంలోపు పరిష్కరించాలి : నగర కమిషనర్ కె. మయూర్ అశోక్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ సేవల దరఖాస్తులను (మ్యుటేషన్, న్యూ టాక్స్, వీఎల్‌టీ) వారంలోపు పరిష్కరించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐల వారీగా రెవెన్యూ, వీఎల్‌టీ పన్నుల వసూళ్ల వివరాలను సమీక్షించారు. పన్నుల వసూళ్లు తక్కువగా ఉన్న అధికారులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను సాధించాలని సూచించారు.
కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే మ్యుటేషన్, నూతన పన్నుల విధింపు, వీఎల్‌టీ తదితర సేవల దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యం, జాప్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుంచి అందే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
నగరంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పొందిన అపార్ట్‌మెంట్లలోని అన్ని ప్లాట్లకు పన్నులు విధించారా లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందజేయాలని సూచించారు. నగరపాలక సంస్థకు చెందిన దుకాణాల అద్దె బకాయిలను నూరు శాతం వసూలు చేయాలని, లీజు గడువు ముగిసిన దుకాణాలకు ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే వేలం నిర్వహించి తిరిగి కేటాయించాలని ఆదేశించారు.
రెవెన్యూ సేవలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను, దరఖాస్తులను సరైన కారణం లేకుండా తిరస్కరిస్తే సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో వీఎల్‌టీ, నూతన పన్నుల విధింపునకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పన్నులు విధించాలని తెలిపారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వచ్చే దరఖాస్తులను అనవసరంగా తిరస్కరించకుండా అర్హత మేరకు అన్నింటికీ పన్నులు విధించాలని, గతంలో తిరస్కరించిన దరఖాస్తులను సైతం తిరిగి పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నగరంలోని నూతన అపార్ట్‌మెంట్లు, లేఅవుట్లకు నిబంధనల ప్రకారం పన్నులు విధించాలని, ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఐ. కిషోర్, రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, జి. సాంబశివరావు, సూపరింటెండెంట్ రవికిరణ్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.