-పోస్టర్ విడుదల చేసిన కమిషనర్ చక్రధర్‌బాబు
-ఫిబ్రవరి 28 వరకు ప్రత్యేక కార్యక్రమం
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా నివారణ, శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా చేపట్టిన ‘సాన్స్–2026-27’ ప్రత్యేక ప్రచార పోస్టర్‌ను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు గురువారం మంగళగిరిలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ప్రచారం ఫిబ్రవరి 28, 2027 వరకు కొనసాగుతుందని తెలిపారు. చిన్నారుల్లో న్యుమోనియా లక్షణాలను ముందుగా గుర్తించి, సకాలంలో చికిత్స అందించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. దగ్గు, వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీ లోపలికి లాగబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. తల్లిపాలు, టీకాలు, పరిశుభ్రతతో వ్యాధి ముప్పును తగ్గించవచ్చన్నారు.
చిన్నారుల ఆరోగ్య సంరక్షణ ఆర్బీఎస్కే 2.0తో మరింత బలోపేతం
మంగళగిరిలోని ఓ హోటల్లో రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం
రాష్ట్రంలో చిన్నారులు, కౌమారదశలోని వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా జాతీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) 2.0ను మరింత బలోపేతం చేస్తున్నట్లు రాష్ట్ర కార్యక్రమ అధికారి డాక్టర్ వి.వి.బి. సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళగిరిలోని ఓ హోటల్లో నిర్వహించిన ఆర్బీఎస్కే 2.0, ఆర్కేఎస్కే రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి, సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడటమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి తదుపరి పరీక్షలు, చికిత్సలు, శస్త్రచికిత్సలు అందించేలా వైద్య సేవలను సమన్వయం చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రసవ కేంద్రాలు, నవజాత శిశువుల ఇళ్ల సందర్శనల ద్వారా చిన్నారులకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యాధికారులు, పిల్లల వైద్య నిపుణులు, జిల్లా బాలల ముందస్తు చికిత్స కేంద్రాల సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
నవంబర్ 9 నాటికి రాష్ట్రంలో నమోదైన 53.66 లక్షల మంది చిన్నారుల్లో 30.64 లక్షల మందికి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 637 శస్త్రచికిత్సలు చేపట్టినట్లు తెలిపారు.
చిన్నారులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, వైద్య సమస్యలను నిర్ధారించడం, అవసరమైన వైద్య సేవలకు పంపించడం, చికిత్స పూర్తయ్యే వరకు పర్యవేక్షించడం వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు.
జిల్లా బాలల ముందస్తు చికిత్స కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు, వైద్య సిబ్బంది, ప్రత్యేక వైద్య సేవలను మెరుగుపరచాలని సూచించారు. పుట్టుకతో వచ్చే లోపాలు గుర్తించిన చిన్నారులకు శస్త్రచికిత్సలను వేగంగా నిర్వహించాలని, చికిత్స కోసం రవాణా సౌకర్యాలను సమర్థంగా వినియోగించాలని పేర్కొన్నారు.
డిజిటల్ విధానంలో ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు, చికిత్స పురోగతిని పర్యవేక్షిస్తూ అర్హులైన ప్రతి చిన్నారికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
