-జగన్‌రెడ్డి ఆరోపణలపై మండిపడ్డ మంత్రి సత్యకుమార్ యాదవ్
-నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో జగన్‌రెడ్డి నిర్వాకాలను ఎండగట్టిన మంత్రి
-కేవలం ఒక ఏడాదిలో దాదాపు రూ. 6,000 కోట్లు వ్యయం చేయడం కూటమి ప్రభుత్వానికి ఎలా సాధ్యం?
-నాలుగు పేజీల లేఖలో జగన్‌రెడ్డిని నిలదీసిన మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
పీపీపీ విధానంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం, ఇందుకోసం కేంద్రం నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజీయఫ్) సహాయం పొందడంపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలను వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తన ప్రభుత్వ నిర్వాకం వల్ల కొట్టుమిట్టాడుతున్న ఈ కళాశాలల నిర్మాణానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తూ జగన్‌రెడ్డికి మంత్రి గురువారంనాడు 4 పేజీల లేఖను రాశారు. రాజకీయ దురుద్దేశాలతో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం బురద జల్లడాన్ని ఇకనైనా మానుకోవాలని మంత్రి హితవు పలికారు.
కేంద్ర సహాయం పొందడం ప్రజా ద్రోహమా?
దేశ వ్యాప్తంగా వైద్య రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా వైద్య కళాశాలలతో సహా మౌలిక వసతుల కల్పనను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం వీజీయఫ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు 5 వైద్య కళాశాలల ( నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ ) నిర్మాణానికి ఈ పధకం కింద వీజీయఫ్ సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు ఈ 5 కళాశాలల మొత్తం నిర్మాణ ఖర్చు రూ. 3,706.60 కోట్లలో రూ. 1,091.11 కోట్లు ( 30 శాతం ) వీజీయఫ్‌గా కేంద్రం ఇవ్వనున్నదని తెలిపిన మంత్రి రాష్ట్రంలో వైద్య విద్య విస్తరణ కోసం ఈ మేరకు భారీ సహాయాన్ని పొందడం ప్రజా ద్రోహం ఎలా అవుతుందని జగన్‌రెడ్డిని మంత్రి నిలదీశారు.
వీజీయఫ్‌ను వ్యతిరేకించడంలో…తన నిర్వాకం వల్ల కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల నిర్మాణం కూటమి ప్రభుత్వ కృషితో సానుకూలమవుతుందేమోనన్న అంతర్లీనమైన భయం జగన్‌లో వ్యక్తమవుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ వైఖరిని ఇకనైనా మానుకోవాలని మంత్రి హితవు పలికారు.
తనకొక నీతి-కూటమికి మరొకటా?
తాను ప్రకటించిన 17 నూతన వైద్య కళాశాలల నిర్మాణానికి ఎంతో చేశానని…కూటమి ప్రభుత్వం ఏడాదికి కేవలం రూ. 1,000 కోట్లు వెచ్చిస్తే అన్నీ ఉనికిలోకి వచ్చి ఉండేవన్న జగన్ వ్యాఖ్యను మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా దుయ్యబట్టారు. రూ. 8,480 కోట్ల వ్యయంతో 2020-21 లో 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని ఆర్భాటంగా ప్రకటించిన మాజీ సీఎం అప్పటి నుండి అందుబాటులో ఉన్న నాలుగేళ్ల కాలంలో కేవలం రూ. 1,406.60 కోట్లు ( 16.56 శాతం) మాత్రమే వెచ్చించిన జగన్‌రెడ్డి ప్రస్తుత స్థితికి కూటమి ప్రభుత్వాన్ని నిందించడం ఏ మాత్రం సబబు కాదని మంత్రి స్పష్టం చేశారు.
అన్ని 17 కళాశాలలను పూర్తి స్థాయిలో నిర్మించడానికి జగన్‌రెడ్డి లెక్కల ప్రకారమే ఇంకా రూ. 7,093.40 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, జగన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు ఏడాదికి రూ. 1,000 కోట్లు చొప్పున వ్యయం చేస్తే వీటి నిర్మాణాలను పూర్తి చేయడానికి కనీసంగా ఏడేళ్లు పడుతుందని, ఆ లెక్కన 2031 వరకు వీటి నిర్మాణాలు కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి వివరించారు. 2025-26 నాటికి ఒక్కో కాలేజీలో 150 ఎంబిబియస్ ప్రవేశాల లెక్కన మొత్తం 17 కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన మాజీ సీఎం బుధవారంనాడు మాట తప్పడాన్ని మంత్రి ఎత్తి చూపారు.
జగన్ హయాంలో కునారిల్లిన నిర్మాణాలు
జగన్ హయాంలో అత్యంత మందకొడిగా సాగిన వైద్య కళాశాలల నిర్మాణాల వివరాలను మంత్రి తన లేఖలో మాజీ సీఎం దృష్టికి తెచ్చారు. మొత్తం 17 కళాశాలలకు సంబంధించి జగన్‌రెడ్డి నాలుగేళ్లలో 8 కాలేజీల నిర్మాణంపై ఆమోదిత వ్యయంలో కేవలం 10 శాతానికి లోపు నిధులు వ్యయం చేశారని, మరో 6 కళాశాలలకు సంబంధించి జరిగిన వ్యయం 11 శాతం నుంచి 25 శాతం వరకు మాత్రమే ఉందని, కేవలం పులివెందుల కళాశాలకు మాత్రమే ఆమోదిత రూ. 500 కోట్ల వ్యయంలో రూ. 396.16 కోట్లు (79.23 శాతం ) వెచ్చించి తన పాక్షిక మానసికతను వెల్లడించుకున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ జగన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు.
మారిన ఎన్ఎంసి నిబంధనలు
2022 వరకు అమలులో ఉన్న జాతీయ వైద్య సంఘం(ఎన్ఎంసి) నిబంధనల మేరకు…కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు ఉంటే ప్రతిపాదిత మొత్తం ప్రవేశాలకు ఎన్ఎంసి అనుమతించేదని…ఆ మేరకు మొదటి దశలోని 5 కళాశాలలకు సంబంధించి జరిగిన వ్యయం కేవలం 19.38 శాతమే అయినా ఏడాదికి 150 సీట్లతో 2023-24 లో ఎన్ఎంసి అనుమతించిందని మంత్రి అన్నారు. అయితే 2023 లో నిబంధనలు మార్చిన ఎన్ఎంసి 2024-25 లో పాడేరు కళాశాల నిర్మాణానికి దాదాపు 27 శాతం వ్యయం జరిగినా కేవలం 50 ప్రవేశాలకే అనుమతించిందని జగన్‌రెడ్డికి మంత్రి గుర్తు చేశారు.
నూతన ఎన్ఎంసి నిబంధనల మేరకు రెండు, మూడో దశల్లో జగన్‌రెడ్డి ప్రతిపాదించిన మిగిలిన 12 కళాశాలల్లో 2024-25 మరియు 2025-26 లలో 150 ప్రవేశాలు చొప్పున ఎన్ఎంసి అనుమతి పొందడానికి జూన్ 2024 లో అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం ఒక ఏడాదిలోనే రూ. 5,807 కోట్ల వ్యయం చేయాల్సి ఉందని, ఇదెలా సాధ్యమని జగన్‌రెడ్డిని మంత్రి నిలదీశారు.
జగన్ నిర్వాకాల వల్లే పీపీపీ
ఐదేళ్ల పాలనలో అస్తవ్యస్థ పరిపాలన, ఆర్థిక విధానాలతో రూ. 10 లక్షలకు పైగా రుణ భారాన్ని వారసత్వంగా పొందిన కూటమి ప్రభుత్వం, ఆర్థిక ఆదాయం, వనరుల లభ్యత, నూతన వైద్య కళాశాలల నిర్మాణం, వార్షిక నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 9 ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో కొనసాగించడానికి నిర్ణయించిందని మంత్రి స్పష్టం చేశారు. పీపీపీ వల్ల వైద్య విద్య ఖర్చు పెరుగుతుందన్న జగన్‌రెడ్డి వ్యాఖ్యను మంత్రి దుయ్యబట్టారు. నూతన వైద్య కళాశాలల నిర్మాణం కేవలం ప్రభుత్వ నిధులతో నిర్మించలేమని స్పష్టం చేసి, సెల్ప్ ఫైనాన్సింగ్ విధానమంటూ నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సగం సీట్ల వార్షిక ఫీజును రూ. 10 లక్షలు మరియు రూ. 20 లక్షలుగా నిర్ణయించిన మాజీ సీఎంకు పీపీపీని వ్యతిరేకించే నైతిక హక్కు లేదని మంత్రి స్పష్టం చేశారు.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పధకం కూడా పీపీపీ విధానంలోనే నడుస్తోందని, 2024-25 సంవత్సరానికి ప్రైవేట్ ఆసుపత్రులకు దాదాపు రూ. 2,500 కోట్ల మేర ప్రభుత్వ చెల్లింపులు జరిగాయని, ఇది కూడా ప్రజా వ్యతిరేకమా అని జగన్‌రెడ్డిని మంత్రి నిలదీశారు. కూటమి పాలనలో ఈ పధకం కింద లబ్దిదారుల సంఖ్య, ఉచిత వైద్య సేవల వ్యయం, సాలీనా నిధుల విడుదలలో 60 శాతం నుంచి 70 శాతం పెరుగుదల నమోదైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
చర్చకు సదా సిద్ధం
వైద్య రంగానికి సంబంధించి ఏ విషయంపైనైనా జగన్‌రెడ్డితో గాని, ఆయన సూచించిన ప్రతినిధులతో గాని చర్చించడానికి తాను సదా సిద్దంగా ఉన్నానని మంత్రి సత్యకుమార్ యాదవ్ తన లేఖలో జగన్ రెడ్డికి తెలిపారు.
