-కూటమిపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామీణ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రధాన కారణాలని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల సరళి పరిశీలిస్తే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం స్పష్టమవుతోందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పునర్నిర్మాణం, కొత్త రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీబీ జీ రామ్ జీ, సాస్కీ నిధులను సద్వినియోగం చేసుకుంటున్నామని, జల్ జీవన్ మిషన్‌కు కేంద్రం నిధులు అందించిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రైతులకు అండగా నిలుస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రైతులకు కల్పించిన భరోసా ప్రజల మద్దతుకు కారణమయ్యాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై గ్రామీణ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
