మురసు తుఫాన్ నష్టం, సహాయక చర్యలపై సీఎం సమీక్ష

-నిత్యావసరాల ధరల తగ్గింపు చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో మురసు తుఫాన్ ప్రభావం, తదనంతర సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయ తదితర కీలక శాఖల అధికారులతో మాట్లాడిన సీఎం, క్షేత్రస్థాయిలో చేపడుతున్న సహాయ పునరావాస చర్యలపై ఆరా తీశారు. తుఫాన్ ధాటికి కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు తక్షణ ఆర్థిక సాయం అందించే అంశంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పంట నష్టం అంచనాల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి దాదాపు 92 శాతం మేర అంచనాలు పూర్తయ్యాయని, వ్యవసాయ పంటలకు సంబంధించి ఈ నెల 9వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో నష్టాల అంచనా వేసే ప్రక్రియ ముగుస్తుందని అధికారులు వెల్లడించారు. రెండు తుఫాన్ల ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరణ, కూలిన స్థంభాలను తిరిగి ఏర్పాటు చేయడం వంటి పనులపై సీఎం ఆరా తీశారు. అర్నబ్ తుఫాన్ వల్ల సుమారు 30 వేల విద్యుత్ స్థంభాలు దెబ్బతిన్నాయని… అన్ని గ్రామాలకు విద్యుత్ పునరుద్దరించినట్టు చెప్పారు. ఇక మురుసు తుఫాన్ వల్ల ప్రభావితమైన 1825 గ్రామాల్లో విద్యుత్ పునరుద్దరణ పనులు చేపట్టినట్టు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దెబ్బతిన్న 7850 విద్యుత్ స్థంభాలను బాగు చేసినట్టు వివరించారు. ఇక తుఫాన్ బాధితులకు నిత్యావసరాల పంపిణీ నిరంతరాయంగా సాగుతోందని తెలిపిన పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు 3.82 లక్షల కుటుంబాలకు తుఫాన్ సహయ చర్యల్లో భాగంగా నిత్యావసరాలను అందించామని వెల్లడించారు. రేపటిలోగా పూర్తి స్థాయిలో పంపిణీని పూర్తి చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

నిత్యావసరాల ధరలను అదుపు చేసేలా చర్యలు.

మరోవైపు మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. ఉల్లిపాయలు, బియ్యం, పామాయిల్, గోధుమ పిండి, కందిపప్పు వంటి వాటి ధరలను నియంత్రించడంతోపాటు..కొన్ని నిత్యావసరాలను రేషన్ దుకాణాల్లో అందించే ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయని ముఖ్యమంత్రి అడిగారు. కిలో రూ.35కే ఉల్లిపాయలను రైతుబజార్ల ద్వారా పంపిణీ చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా 8 వేల క్వింటాళ్ల ఉల్లిపాయలను మార్కెట్లోకి దిగుమతి చేసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలను అదుపులో ఉంచేలా నిరంతరం మిల్లర్లు, హోల్ సేల్ వ్యాపారస్తులను మాట్లాడుతున్నామని అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్లో బీపీటీ సోనా- సాంబ-కేఎన్ఎం రకాల బియ్యాన్ని రూ. 66కు, హెచ్ఎంటీ-ఆర్ఎన్ఆర్ రకాల బియ్యాన్ని రూ. 76కు, జై శ్రీరామ్ రకాన్ని రూ. 82కు, కామన్ వెరైటీలను రూ.47కు విక్రయించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని తెలిపారు. దీంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను ఉల్గించిన 204 వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ధరణి బ్రాండ్ బియ్యాన్ని రైతు బజార్లల్లో అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు. బహిరంగ మార్కెట్లో రూ. 70లకు విక్రయిస్తున్న బియ్యాన్ని రైతు బజార్లల్లో రూ. 50లకు అందుబాటులోకి తెచ్చామని.. అలాగే బీపీటీ రకం బియ్యాన్ని రూ.49లకు విక్రయిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 150 కౌంటర్ల ద్వారా 27,430 క్వింటాళ్ల బియ్యాన్ని 1.03 లక్షల కుటుంబాలు వినియోగించుకున్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. రూ. 125కు లీటర్ పామాయిల్, రూ. 100కు కిలో కందిపప్పు, రూ. 25కు కిలో గోధుమ పిండిని రేషన్ దుకాణాల ద్వారా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.