తదుపరి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలి

-కౌంటింగ్‌లో జాప్యం నివారించాలి.. ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించబడిందని, అదే స్ఫూర్తితో తదుపరి విడతల్లో జరగనున్న రెండో, మూడో విడత ఎన్నికలను మరింత సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదటి విడత ఎన్నికల నిర్వహణపై ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సంబంధిత ఎన్నికల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి విడత ఎన్నికల సందర్భంగా ఎదురైన సమస్యలు, కౌంటింగ్ ప్రక్రియలో జరిగిన జాప్యాలు, తదుపరి విడతల్లో చేపట్టాల్సిన మెరుగైన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను 15 నిమిషాల్లోపు సీల్ చేసి, భద్రతా నిబంధనల మేరకు లెక్కింపు కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మొదటి విడతలో కొన్ని ప్రాంతాల్లో డాక్యుమెంటేషన్, స్టాట్యూటరీ ఫారాల పూర్తి చేయడంలో జాప్యం కారణంగా మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు ఆలస్యమైందని పేర్కొన్నారు. తదుపరి విడతల్లో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, అవసరమైన ఫారాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల సిబ్బందికి తగిన శిక్షణ అందించి కౌంటింగ్ ప్రక్రియను నిర్ణీత సమయానికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తప్పనిసరిగా కనీసం 10 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తక్కువ సంఖ్యలో టేబుళ్లు ఏర్పాటు చేయడం వల్ల కౌంటింగ్ రౌండ్లు పెరిగి, ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని తెలిపారు. వార్డుల సంఖ్యకు అనుగుణంగా తగినన్ని కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒకటి లేదా రెండు రౌండ్లలోనే లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో స్థలం సరిపోని పక్షంలో పక్క గదులను వినియోగించుకోవాలని లేదా ప్రత్యామ్నాయ కేంద్రాలను ముందుగానే ఎంపిక చేసుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నందున, కౌంటింగ్ కేంద్రాల లోపల, బయట తగినంత వెలుతురు ఉండేలా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎంపీడీఓలు స్వయంగా పర్యవేక్షించి, నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లెక్కింపు కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చాలని తెలిపారు. ఓటింగ్ సమయంలో చెల్లని ఓట్ల నమోదు తగ్గించేందుకు, అధికారులు కొత్తగా సరఫరా చేసిన స్వస్తిక్ స్టాంపులను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. పాత స్టాంపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి, ముఖ్యంగా వయసు పైబడిన వారికి, ఆరోగ్య సమస్యలు ఉన్న సిబ్బందికి సకాలంలో భోజనం, తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విధుల నిర్వహణలో సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో అధికారులు సిద్ధంగా ఉండాలని, అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. నందిగామ, తిరువూరు డివిజన్ల పరిధిలో జరగనున్న రెండో, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమీక్షలో సూచించిన అన్ని మార్పులు, మెరుగుదలలను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయం, ముందస్తు ప్రణాళిక, సమయపాలన అత్యంత కీలకమని పేర్కొంటూ, ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, చేపట్టిన చర్యలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.