గల్లంతైన కాకినాడ మత్స్యకారులు సురక్షితం

-సీఎం ఆదేశాలతో నిరంతర పర్యవేక్షణ… ఫలించిన గాలింపు చర్యలు
-అర్ధరాత్రి దాటాక కాకినాడ తీరానికి చేరిక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ గల్లంతైన కాకినాడ జిల్లా సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని అధికారులు నిర్ధారించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం, ప్రత్యేక గాలింపు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. దీనితో మత్స్యకారుల ఆచూకీని వేగంగా గుర్తించగలిగారు. కాకినాడ జిల్లా సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతయ్యారు. ఈ నెల 19వ తేదీన వారితో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. సీఎం ఆదేశాలతో వివిధ శాఖలు సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రి సూచనలతో అధికారులు ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తూ గాలింపు బృందాలను అప్రమత్తం చేశారు. అదే సమయంలో మత్స్యకార కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు లోతట్టు సముద్ర ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ మొబైల్ సిగ్నల్స్ అందక సమాచార సంబంధాలు నిలిచిపోయినట్లు తేలింది. గురువారం సాయంత్రం 4:30 గంటల సమయంలో బోటు యజమాని ఫోన్ సిగ్నల్ పరిధిలోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారులు గురువారం సాయంత్రం 5:15 గంటలకు బోటు యజమానితో నేరుగా ఫోన్‌లో మాట్లాడి, బోటులోని ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్నారు. బోటుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఈ బోటు అనకాపల్లి జిల్లా బంగారమ్మపాలెం సమీపంలో ఉందని, మరికొన్ని గంటల్లో కాకినాడ తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మత్స్యకారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ… తీరానికి చేరేంత వరకు పర్యవేక్షిస్తూ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. మత్స్యకారుల క్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.