ఆరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో శుక్రవారం (నవంబర్ 27) అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు.
నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడవచ్చని వెల్లడించారు.
మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గురువారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం గుంటూరు జిల్లా తెనాలిలో 29.4 మి.మీ., నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 25 మి.మీ., తిరుపతి జిల్లా పుత్తూరులో 21 మి.మీ., గుంటూరు జిల్లా వడ్లమూడిలో 20.8 మి.మీ., నెల్లూరు రూరల్‌లో 20 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు ప్రఖర్ జైన్ తెలిపారు.