గల్లంతైన మత్స్యకారుల బోటు సురక్షితం.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

– బోటు నంబర్ 927 క్షేమంగా ఉన్నట్లు అధికారుల నిర్ధారణ
– బోటు యజమానితో నేరుగా మాట్లాడిన కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి
– డీప్‌ సీ లో మొబైల్ సిగ్నల్ లేకపోవడంతో నిలిచిపోయిన సమాచార సంబంధాలు
– ప్రస్తుతం బంగారంపాలెం వద్ద బోటు.. మరో ఆరు గంటల్లో కాకినాడకు చేరుకునే అవకాశం
– మత్స్యకారుల కుటుంబాలకు భరోసా ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
కాకినాడ జిల్లా సుబ్బంపేటకు చెందిన గల్లంతైన మత్స్యకారుల బోటు నంబర్ 927 సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందిందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి స్వయంగా బోటు యజమానితో ఫోన్‌లో మాట్లాడి క్షేమ సమాచారాన్ని నిర్ధారించుకున్నారని వెల్లడించారు. బోటు ప్రస్తుతం బంగారంపాలెం వద్ద ఉన్నట్లు అధికారులు తెలిపారని, మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. మత్స్యకారులు చేపల వేట కోసం డీప్‌ సీ ప్రాంతానికి వెళ్లడంతో మొబైల్ సిగ్నల్ అందుబాటులో లేక సమాచార సంబంధాలు నిలిచిపోయాయని మంత్రి వివరించారు. చేపల వేట ముగించుకుని సిగ్నల్ పరిధిలోకి వచ్చిన వెంటనే అధికారులను సంప్రదించి తాము క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించారని తెలిపారు. బోటుకు ఎలాంటి ఇబ్బంది లేదని సమాచారం అందడం సంతోషకరమన్నారు. అధికారులకు అందిన సమాచారం ప్రకారం బోటు మరో ఆరు గంటల్లో కాకినాడ తీరానికి చేరుకునే అవకాశం ఉందని, నవంబర్ 27 తెల్లవారుజామున 12 నుంచి ఒంటిగంట మధ్య చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. బోటు సురక్షితంగా తీరానికి చేరుకునే వరకు పరిస్థితిని పర్యవేక్షించాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు. మత్స్యకారుల క్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.