-రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం, పారదర్శకం కానున్నాయి: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. భూ రికార్డుల ఆధునికీకరణ కార్యక్రమం కింద విజయవాడలో అత్యాధునిక ప్రజా సేవా కేంద్రం తరహా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు రూ.50 లక్షలు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు.
విజయవాడ ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఆ విజ్ఞప్తుల మేరకు భూ రికార్డుల ఆధునికీకరణ పథకం కింద నిధులు కేటాయించినట్లు తెలిపారు.
నూతన కార్యాలయం అందుబాటులోకి వస్తే ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గడంతో పాటు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిధుల మంజూరుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌కు విజయవాడ ప్రజల తరఫున ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
