రాజ్యాంగం గొప్పదైనా.. అమలు చేసేవారిలో చిత్తశుద్ధి ఉండాలి!

-ఓటు హక్కును హరిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న పాలకులు.. ఐక్య ఉద్యమాలతో ఓటు హక్కును కాపాడుకోవాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే పాలకులు, వ్యవస్థలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ప్రజలకు న్యాయం జరగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకు పాలకుల చిత్తశుద్ధి, రాజ్యాంగ సంస్థల స్వతంత్రత అవసరమని పేర్కొన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న విజయవాడలో ఓటు హక్కు పరిరక్షణ వేదిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు హక్కు పరిరక్షణ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్ విగ్రహం వరకు సాగింది. అక్కడ నిర్వహించిన ముగింపు సభలో ఈశ్వరయ్య ప్రసంగించారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఒక ఓటు, సమాన విలువ కల్పించిందని, కుల, మత, ప్రాంత, ఆర్థిక భేదాలకు అతీతంగా ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు ఇచ్చిందని తెలిపారు. అయితే ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కుకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు, వలస కార్మికులు, వృద్ధులు ఓటు హక్కుకు దూరం కాకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని హెచ్చరించారు. ఓటర్ల పేర్ల తొలగింపు, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపాలు, ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం కలిగిస్తాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల అడ్డగింత, బెదిరింపులు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై ఎన్నికల సంఘం సమర్థవంతంగా స్పందించాలని కోరారు.
ప్రజల నిరసన హక్కును అణచివేయడం, ప్రశ్నించే గొంతులను బలహీనపరచడం, ప్రజాస్వామ్య సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఈశ్వరయ్య అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రజల జీవితాల్లో అమలైనప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రసంగాలు చేయడం మాత్రమే కాకుండా, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు అందించడం, ఓటు హక్కుకు రక్షణ కల్పించడం, ప్రభుత్వాలను ప్రశ్నించే స్వేచ్ఛను కాపాడటమే నిజమైన రాజ్యాంగ పరిరక్షణ అని స్పష్టం చేశారు. ఓటు హక్కును హరించే చర్యలను అడ్డుకునేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు వై. వెంకటేశ్వరరావు, బాబూరావు, ప్రముఖ న్యాయవాది శంకర్ రాజేంద్ర ప్రసాద్, సుబ్బరావమ్మ, చంద్రనాయక్, ప్రసాద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.