అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు, బెదిరింపులపై టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా అహోబిలంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై జరిగిన రాళ్లదాడి, పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా అభ్యర్థిపై జరిగిన దాడి ఘటనలను ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఖండించారు.
ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ కుప్పం రాజశేఖర్‌తో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఎ. మల్లికార్జున, ఐజీ రాజకుమారిని కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందలేమనే భావనతో వైసీపీ శ్రేణులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అహోబిలంలో అఖిలప్రియ వాహనంపై జరిగిన దాడిలో అద్దాలు ధ్వంసమై డ్రైవర్ గాయపడినట్లు వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. మన్యం జిల్లాలో మహిళా అభ్యర్థిపై జరిగిన దాడిని కూడా తీవ్రంగా ఖండించారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను భయపెట్టడం, ప్రత్యర్థి అభ్యర్థులను అడ్డుకోవడం, పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు సృష్టించడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతమని పేర్కొన్నారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
రాజకీయ పార్టీలు ప్రజల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేయాలే తప్ప దాడులు, బెదిరింపుల ద్వారా రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించకూడదని వర్ల రామయ్య అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మన్యం జిల్లాలో మహిళా అభ్యర్థిపై దాడిపై ఆందోళన.. ఎన్నికల సంఘానికి టీడీపీ నేతల ఫిర్యాదు
