జాతీయ రహదారి నిర్మాణం నేపథ్యంలో అభయాంజనేయ స్వామి ఆలయ మార్పిడి – భక్తుల మనోభావాలకు అనుగుణంగానే అన్ని కార్యక్రమాలు నిర్వహించాం: జిల్లా కలెక్టర్

-ఆలయ నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా 50 సెంట్ల స్థలం కేటాయింపు
-ఆలయానికి సంబంధించిన నిర్మాణ నష్టపరిహారంగా సుమారు రూ.60 లక్షల చెల్లింపు
-ప్రధాన అర్చకులు, గ్రామస్తులు నిర్ణయించిన ముహూర్తంలోనే పూజలు నిర్వహించి ఆలయ మార్పిడి
-ఆంజనేయ స్వామి ఆలయ మార్పిడి పై అసత్య ప్రచారాలను నమ్మొద్దు
-పాత్రికేయ సమావేశంలో వాస్తవాలను వెల్లడించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
జాతీయ రహదారి నిర్మాణం నేపథ్యంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగానే ఆంజనేయపురం అభయాంజనేయ స్వామి ఆలయ మార్పిడి కార్యక్రమాలు నిర్వహించామని, ఆలయ మార్పిడి పై వచ్చే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని విసి హాల్ నందు జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఎన్ హెచ్ పిడి రవీంద్ర, ఆలయ ఈఓ మునిశేఖర్, అర్చకులు దిలీప్, గ్రామస్తులు హేమంత్ కుమార్ తో కలసి జిల్లా కలెక్టర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కడప–రేణిగుంట జాతీయ రహదారి-716 విస్తరణలో భాగంగా ఆంజనేయపురం అభయాంజనేయ స్వామి ఆలయాన్ని తొలగించి, ఆలయ ప్రధాన అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు అభిప్రాయాలు, ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ స్థలంలో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠాపన చేసే ప్రక్రియను, నిర్వహించడం జరిగిందని తెలిపారు. అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సుమారు 60 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన సుఖదానయ్య నిర్మించారని, అప్పటి నుంచి గ్రామ ప్రజలు స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తూ వచ్చారని తెలిపారు. 2002 సంవత్సరంలో దేవాదాయ శాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుందని, అప్పటి నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షణలో స్థానిక అర్చకులు, గ్రామ పెద్దల సహకారంతో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు.

కడప–రేణిగుంట జాతీయ రహదారి-716 అలైన్‌మెంట్ ప్రతిపాదనను 2019లో రూపొందించగా, అదే సంవత్సరం డిసెంబర్‌లో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం జాతీయ రహదారుల శాఖ అభ్యర్థన మేరకు రహదారి అలైన్‌మెంట్ పరిధిలోని భూముల సేకరణకు సంబంధించి 2023 జనవరిలో జిల్లా యంత్రాంగం ద్వారా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. 2023 ఆగస్టులో భూసేకరణకు సంబంధించి అవార్డు జారీ చేసి భూమిని జాతీయ రహదారుల శాఖకు అప్పగించడం జరిగిందని తెలిపారు. గ్రామ పెద్దలతో చర్చించి వారి సమ్మతితో రూ.59.30 లక్షల పరిహార మొత్తాన్ని 2026 ఆగస్టులో దేవాదాయ శాఖకు డిపాజిట్ చేయడం జరిగిందని వెల్లడించారు.

గ్రామ ప్రజలు దేవాలయానికి చెల్లించిన పరిహారంతో కొత్త ఆలయాన్ని నిర్మించాలని కోరడంతో, ప్రస్తుతం ఉన్న ఆలయానికి ఆనుకుని కొత్త ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించి, పాత ఆలయానికి సంబంధించిన 10 సెంట్ల భూమికి బదులుగా 50 సెంట్ల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. ఈ భూమిని నవంబర్ 11వ తేదీన రెవెన్యూ శాఖ నుంచి ఆలయానికి అధికారికంగా అప్పగించడం జరిగిందని తెలిపారు. ఆలయాన్ని తొలగించిన అనంతరం నిత్య పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా తాత్కాలిక షెడ్డు నిర్మించాలని ప్రధాన అర్చకులు, గ్రామ ప్రజలు కోరగా, వారి అభ్యర్థన మేరకు జాతీయ రహదారుల శాఖ నాలుగు నెలల క్రితమే అవసరమైన నిధులతో షెడ్డు నిర్మాణం చేపట్టిందన్నారు.

గ్రామ ప్రజలు, ప్రధాన అర్చకులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 2026 నవంబర్ 22వ తేదీన బాలాలయ కార్యక్రమంతో పాటు శాంతి హోమం నిర్వహించారని తెలిపారు. గ్రామ ప్రజల సమక్షంలో ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవనంలోకి శాస్త్రోక్తంగా తరలించి ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో గ్రామ ప్రజలు, ప్రధాన అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు, జాతీయ రహదారుల శాఖ అధికారుల సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారంలో వాస్తవాలు లేవని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి లేదని తెలిపారు. స్వామివారికి ఎలాంటి అరిష్టం కలగకుండా, గ్రామ ప్రజలు మరియు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.

జాతీయ రహదారి అలైన్‌మెంట్‌ను జిల్లా యంత్రాంగం స్వయంగా మార్చే అవకాశం లేదని, కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించిన 2019 డిసెంబర్ నాటి అలైన్‌మెంట్ ప్రకారమే భూసేకరణ, పరిహారం చెల్లింపు, తదుపరి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలు, ఆంజనేయపురం గ్రామస్తులు, ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు, జాతీయ రహదారుల శాఖ అధికారుల సమన్వయంతోనే నవంబర్ 23వ తేదీన ఆలయ తొలగింపు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తెలిపారు.

గ్రామస్తుడు మరియు ఆలయ భూదాత సుఖదేవయ్య కుమారుడు హేమంత్ కుమార్ మాట్లాడుతూ 60 సం. ల క్రితం తన నాన్న ఆలయ ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం నేషనల్ హైవే కారణంగా ఆలయం తొలగింపబడుతుందన్న సమాచారం తెలిసి చాలా బాధగా అనిపించిందని, నేషనల్ హైవే కారణంగా 10 సెంట్లు ఆలయం భూమి పోతుందని, అందుకు పరిహారంగా 50 సెంట్లు స్థలం ఇస్తాము అంటే గ్రామ ప్రజలు ఒప్పుకున్నారన్నారు. ఆలయం తొలగింపుకు ప్రత్యామ్నాయంగా మరో ఆలయం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన తరువాతే మేమందరం ఒప్పుకున్నామన్నారు. అందరి అంగీకారం తోనే జరిగిందని, ఎవరి ప్రోద్బలంతో జరగలేదని తెలిపారు. దానికి గ్రామ పెద్దలు కూడా ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం దేవాదాయశాఖ కు జమ చేసిందని తెలిపారు. తన నాన్న చైర్మన్‌గా 60 ఏళ్లు ఉన్న ప్రతి రోజూ ప్రజలు, భక్తులకు అన్నదాన ప్రసాదం, ప్రతి హనుమజ్జయంతికి కూడా మూడు రోజులు చేయడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత తాను స్వయంగా ప్రతి సంవత్సరం దగ్గరుండి మూడు రోజులు హనుమజ్జయంతి జరిపిస్తున్నానన్నారు. ఎవరిని అడిగినా కూడా ఇది జరిగిన వాస్తవం.

నేషనల్ హై వే పి డి మాట్లాడుతూ ఈ జాతీయ రహదారి అలైన్‌మెంట్‌కు భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2019 డిసెంబర్‌లో ఆమోదం తెలిపిందని, భూసేకరణకు సంబంధించి 2023 జనవరిలో 3A నోటిఫికేషన్ ప్రచురించగా, ఆలయానికి సంబంధించిన 10 సెంట్ల భూ సేకరణ నోటిఫికేషన్‌ను 2023 ఆగస్టులో ప్రచురించినట్లు తెలిపారు. ఆలయ మార్పిడి ప్రక్రియలో భక్తులు, గ్రామస్తుల మనోభావాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రధాన అర్చకులు మరియు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన నిర్మాణాలను తొలగించాల్సి వచ్చినందుకు నష్టపరిహారంగా సుమారు రూ.60 లక్షలు చెల్లించినట్లు వెల్లడించారు. అదేవిధంగా కొత్త ఆలయ నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా సుమారు 50 సెంట్ల స్థలాన్ని కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణాన్ని తొలగించే ముందు ప్రధాన అర్చకులు, గ్రామస్తులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం శాస్త్రోక్తంగా పూజలు, శాంతి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు, ప్రధాన అర్చకులు, ఆలయ ఈఓ (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారని వివరించారు. అంతేకాకుండా, ఆలయంలో నిత్య పూజలు నిర్వహించుకునేందుకు తాత్కాలిక నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరగా, అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. పూజా కార్యక్రమాలన్నీ సంప్రదాయబద్ధంగా పూర్తయిన అనంతరం మరుసటి రోజు ఆలయ నిర్మాణం తొలగింపు, మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.

ఆలయ ఈఓ మాట్లాడుతూ రోడ్డు విస్తరణ లో భాగంగా ఆలయానికి సంబంధించిన సుమారు 10 సెంట్ ల భూమిని నేషనల్ హైవే అథారిటీ భూ సేకరణ ద్వారా తీసుకోవడం జరిగిందని, అందుకు ప్రభుత్వం 50 సెంట్లు భూమి, 59 లక్షల రూపాయలు నష్ట పరిహారం మంజూరు చేసిందని తెలిపారు. వేద పండితుల నిర్ణయించిన ముహూర్తం ప్రకారం నవంబర్ 22 న బాలాలయం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆలయ తొలగింపు చేపట్టమని తెలిపారు.

ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆంజనేయపురంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ మార్పిడి నేపథ్యంలో బాలాలయ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో స్వామివారి బాలాలయం కోసం ఆలయం పక్కనే ప్రత్యేక గదిని నిర్మించినట్లు పేర్కొన్నారు. నవంబర్ 22 న ఆదివారం ప్రధాన కలశ స్థాపన, కలశారాధన, గోపూజ తదితర కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించి, స్వామివారిని తాత్కాలిక మూర్తులలో ఆవాహన చేసి, నూతనంగా నిర్మించిన గదిలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించినట్లు వివరించారు. అనంతరం 23-11-2026 సోమవారం ఉదయం మూలమూర్తులకు శాస్త్రోక్తంగా బాలాలయ కార్యక్రమం నిర్వహించి, నవధాన్యాలలో ప్రతిష్ఠించినట్లు తెలిపారు.