పియం ప్రగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రగతి కింద చేపట్టిన పలు జాతీయ ప్రాజెక్టులు సహా పియం సేతు తదితర అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన పలు జాతీయ ప్రాజెక్టులను నిర్దేశిత గడువు ప్రకారం సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.అదే విధంగా పియం సేతు పధకాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా యువతకు మెరుగైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్ లను ఆదేశించారు.ఇంకా ప్రగతి అంశానికి సంబంధి పలు ప్రాజెక్టుల ప్రగతిని ప్రధాని సమీక్షించారు.
పీఎం-సేతు (PM-SETU – ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫార్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్)అనేది దేశంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ITIs) ఆధునీకరించి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక పథకం.అక్టోబర్ 4, 2025న ప్రారంభమైన ఈ పథకం కోసం ఐదేళ్ల కాలానికి ₹60,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.(కేంద్రం రూ.30,000 కోట్లు,రాష్ట్రాలు రూ.20,000 కోట్లు,పరిశ్రమ భాగస్వాములు రూ.10,000 కోట్లు భరిస్తాయి. హబ్-అండ్-స్పోక్ (Hub-and-Spoke) విధానం లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 1,000 ప్రభుత్వ ఐటీఐలను ఈ పధకం కింద ఆధునీకరిస్తారు.వీటిలో 200 ఐటీఐలను ప్రధాన కేంద్రాలుగా (Hubs) వాటికి అనుబంధంగా మరో 800 ఐటీఐలను (Spokes) అభివృద్ధి చేస్తారు.పరిశ్రమల భాగస్వామ్యం ప్రైవేట్ మరియు కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యంతో (Special Purpose Vehicles – SPV) నేటి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులను రూపొందించి విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ మరియు ప్లేస్‌మెంట్స్ అందిస్తారు.
దేశంలోనే తొలిసారిగా ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ ఆధునీకరణకు ఆమోదం లభించింది.ఇక్కడ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ భాగస్వామ్యంతో రూ.200 కోట్లతో నాలుగు ప్రభుత్వ ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నారు.మొత్తం మీద ఏపీలో 83 ఐటీఐలను ఆధునిక క్లస్టర్లుగా తీర్చిదిద్దనున్నారు.
ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్,ఐఅండ్ఐ శాఖ కార్యదర్శి మరియు పియం ప్రగతి రాష్ట్ర నోడల్ అధికారి కోన శశిధర్,స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జి.గణేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.