కువైట్‌లో చిక్కుకున్న తెలుగు వాసికి మంత్రి సత్యకుమార్ అండ

-సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన బండి రెడ్డి కిరణ్‌ను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. యజమాని, ఏజెంట్ పరంగా ఇబ్బందుల్లో పడ్డ కార్మికుడు కిరణ్‌కు అవసరమైన సహాయం అందించి, ఆయనను భారతదేశానికి రప్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌కు లేఖ రాశారు.

కువైట్‌లో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ కిరణ్ కుటుంబ సభ్యులు మంత్రి కార్యాలయాన్ని సంప్రదించి సహాయం కోరారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి, సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టారు. భారత రాయబార కార్యాలయం ద్వారా జోక్యం చేసుకుని కిరణ్‌కు అవసరమైన సహాయం అందించాలని, ఆయనను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు.