-ఫీల్డ్ ట్రైనర్స్ శిక్షణ విజయవంతంగా పూర్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జనగణన ఫేజ్-2లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనం సమావేశ మందిరంలో గత మూడు రోజులుగా ఫీల్డ్ ట్రైనర్స్కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని ఇంచార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి జాయింట్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ, జనగణన ఫేజ్-2 ప్రక్రియలో ఫీల్డ్ ట్రైనర్స్ కీలక పాత్ర పోషించనున్నారని తెలిపారు. వీరికి అందించిన శిక్షణ ద్వారా జనగణన విధివిధానాలు, సమాచార సేకరణ పద్ధతులు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన కార్యాచరణపై సమగ్ర అవగాహన కల్పించామన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తదుపరి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు సమర్థవంతంగా బోధించి, జనగణన ప్రక్రియలో వారికి ఎటువంటి సందేహాలు లేకుండా పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఫీల్డ్ ట్రైనర్స్పై ఉందన్నారు.
జనగణన అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ కార్యక్రమమని, ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితత్వంతో సేకరించడం, జనగణన విధివిధానాలను పక్కాగా అమలు చేయడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఫీల్డ్ ట్రైనర్స్ తమకు అందించిన శిక్షణను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా వినియోగించుకొని, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు నాణ్యమైన శిక్షణ అందించాలన్నారు.
జనగణన ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇంచార్జ్ కమిషనర్ సూచించారు. తద్వారా జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సెన్సస్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న కుమార్, స్టేట్ ట్రైనర్ సిహెచ్ రమణ, NTR జిల్లా జ్యుడీషియల్ సెక్షన్ సూపరిండెంట్ జి.వెంకటరామయ్య, ఫీల్డ్ ట్రైనర్లు సిబ్బంది పాల్గొన్నారు.
