అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఎప్పుడూ కార్యాలయ విధుల్లో బిజీగా ఉండే వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది బుధవారం రోజంతా సరదాగా గడిపారు. గుంటూరు జిల్లా రాయపూడిలో కృష్ణా నది తీరాన కార్తీక వనభోజనాల సందర్భంగా ఆటపాటలతో సందడి చేశారు. సహోద్యోగులనే భావనను పక్కనపెట్టి అందరూ ఒక కుటుంబంలా కలిసిపోయి, ఆత్మీయ పలకరింపులు, నవ్వులు, సరదా పోటీలతో వేడుకను ఆస్వాదించారు.
వెలగపూడి సచివాలయంలోని వైద్యారోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ మోహన్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమo జరిగింది. మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, స్పూన్ అండ్ లెమన్, బాల్ గేమ్స్ తదితర పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సందడి చేశారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతుల్ని అడిషనల్ సెక్రటరీ, డెప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ బహుమతులను అందజేశారు.
